క్రమశిక్షణ నేర్పాల్సిన గురువే విచక్షణ మరిచి విద్యార్ధులను చితకబాదాడు. బడికి రాలేదన్న కోపంతో విద్యార్థులపై కర్రతో విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ పిల్లలను అమానుషంగా కొట్టారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట భారీ ఆందోళనకు దిగారు. రేజర్ల గ్రామంలో ఇటీవల నిర్వహించిన సత్తెమ్మ తల్లి జాతరకు వెళ్లిన కారణంగా సుమారు 15 మంది విద్యార్థులు మరుసటి రోజు పాఠశాలకు గైర్హాజరయ్యారు. సెలవు పెట్టకుండా బడికి రాలేదన్న ఆగ్రహంతో ప్రధానోపాధ్యాయురాలు నాగమణి, సదరు విద్యార్థులను కర్రతో విచక్షణ రహితంగా కొట్టారు. దెబ్బల ధాటికి విద్యార్థుల వీపులపై వాతలు తేలడం, గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆగ్రహంతో పాఠశాలను ముట్టడించారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయురాలు నాగమణిని వివరణ కోరగా.. విద్యార్థులు తరచుగా పాఠశాలకు రాకపోవడంతో క్రమశిక్షణలో పెట్టేందుకే దండించానని, అయితే కర్రతో కొట్టడం తన తప్పేనని అంగీకరించారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థుల గాయాలను పరిశీలించి, పూర్తిస్థాయి నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారులకు అందజేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చిన్న పిల్లలపై ఇలాంటి భౌతిక దాడులు చేయడం చట్టరీత్యా నేరమని, ఉపాధ్యాయులు సంయమనం పాటించాలని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..
జబర్దస్త్ నటుడికి దారుణ అనుభవం.. లేడీ అనుకుని పొలాల్లోకి లాక్కెళ్లి మరీ
అద్భుతం.. పెన్సిల్ మొనపై శివయ్య రూపం.. రికార్డుల రారాజు
Madhya Pradesh: భార్యతో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భర్త
తెలుగు రాష్ట్రాల్లోను అమల్లోకి రానున్న SIR ప్రక్రియ