టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన బ్యాటింగ్ శైలి, ఆలోచనా విధానంపై పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. సిక్సర్లు కొట్టడం తనకు ఇష్టమైనప్పటికీ, వాటి కోసం గుడ్డిగా బ్యాట్ ఝుళిపించనని అతడు స్పష్టం చేశాడు. ప్రతిసారీ మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడటానికే చూస్తానని చెప్పుకొచ్చాడు. తాజాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. సహచర బ్యాటర్లు రన్స్ చేయడానికి ఇబ్బంది పడిన వికెట్‌పై శివమ్ దూబే మాత్రం అలవోకగా పరుగులు సాధించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులతో చెలరేగి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టి తన ఆల్‌రౌండ్ సత్తాను చాటాడు.
తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, ఇలాంటి సవాలుతో కూడిన పరిస్థితుల్లోనే బ్యాటింగ్ చేయడానికి తాను ఇష్టపడతానని, తన ఆటను ఆస్వాదించానని దూబే అన్నాడు. కొన్నిసార్లు ఒత్తిడికి గురైనప్పటికీ, దానిని అధిగమించగలిగానని తెలిపాడు. ముఖ్యంగా నెదర్లాండ్స్‌కు చెందిన ఆఫ్ స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, దాని వల్ల తాను వరుసగా నాలుగు డాట్ బాల్స్ ఆడాల్సి వచ్చిందని వివరించాడు. ఆ సమయంలో ఆ ఓవర్ బౌలర్‌కు బాగా కలిసి వచ్చినా, ఆ తర్వాత స్కోర్‌ను కవర్ చేయగలనని తనకు తెలుసని పేర్కొన్నాడు.
సిక్సర్లు కొట్టడం ఇష్టమైనప్పటికీ, పరిస్థితులను పట్టించుకోకుండా గుడ్డిగా ఆడలేనని శివమ్ దూబే మరోసారి స్పష్టం చేశాడు. బౌలర్ మంచి బంతులు వేస్తున్నప్పుడు అందుకు తగ్గట్లు బౌండరీ బాదేందుకు తాను సిద్ధంగా ఉంటానని పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయడంపై తాను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపాడు. బౌలర్లు తనను బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తారని, యార్కర్లు, లెంత్ బాల్స్ వేయకుండా షార్ట్ బాల్స్, స్లోయర్ బాల్స్ వేస్తారని తనకు తెలుసని, అందుకే వాటికోసం తాను సిద్ధంగా ఉండి వేచి చూశానని అన్నాడు. మిడిల్ ఓవర్లలో తాను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రన్ రేట్‌ను వేగంగా పెంచాలని కెప్టెన్, కోచ్ తనకు చెప్పారని, అయితే అది పూర్తిగా మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని వివరించాడు. కాగా, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతుండగా.. వీటిని అభిషేక్ శర్మతో లింక్ చేస్తూ కొందరు అతడ్ని ట్రోల్ చేస్తున్నాడు.. ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టడానికి ట్రై చేయడానికి నువ్వేం సెహ్వాగ్ కాదు.. ఇలా దూబేలా మ్యాచ్ పరిస్థితులను చూసి ఆడాలని కామెంట్స్ చేస్తున్నారు.
Shivam Dube credited MS Dhoni for improving his game against the short ball.💛pic.twitter.com/Tj6r7rLOg7
— Saurabh MSDian™ (@mahi163199) February 20, 2026