3 నెలల జైలు జీవితం తర్వాత బైటపడ్డారు ఐబొమ్మ యాప్ నిర్వాహకుడు ఇమంది రవి. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో బుధవారం సాయంత్రం చంచల్గూడా జైల్ నుంచి రిలీజయ్యాడు. ఇండియా దాటి వెళ్లొద్దు.. సోషల్ మీడియా ఖాతాల్ని వాడొద్దు.. ప్రతిరోజూ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరవ్వాలి.. ఇలా 12 బెయిల్ షరతుల మీద బైటికొచ్చిన రవి.. ఇకపై ఏం చెయ్యబోతున్నాడు అనేదే సస్పెన్స్‌గా మారింది.
సినిమా పైరసీతో ఇండస్ట్రీని ఆర్థికంగా చితక్కొట్టి, నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన రవిని గత ఏడాది నవంబర్ 16న సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 21 వేలకు పైగా సినిమాలు, కొత్త ఓటీటీ కంటెంట్ పైరసీలో ఇతడే కింగ్‌పిన్. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు పాల్పడినట్టు అతడిపై ఐదు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినట్టే.
20 రోజులు కస్టడీలో అనేక విషయాల్ని రాబట్టారు పోలీసులు. ఐదేళ్లలో పైరసీ బిజినెస్‌తో 13 కోట్ల మేర వెనకేసుకున్నట్టు, 7 బ్యాంకు ఖాతాల్లో దాచుకున్నట్టు, లావాదేవీలన్నీ విదేశీ కరెన్సీలోనే చేసినట్టు ఒప్పుకున్నాడు. కానీ, ఐబొమ్మ రవి నేతృత్వంలో100 కోట్లకు పైగా పైరసీ దందా జరిగినట్టు ఆధారాలున్నాయి. కూకట్పల్లి ఉషా ముళ్లపూడి అపార్ట్మెంట్లో ఆఫీసు నడిపి, విదేశీ సర్వర్ల ఏర్పాటుతో, ఫేక్ డొమైన్లతో ఇంటర్నేషనల్ నెట్‌వర్క్‌ను లీడ్ చేశాడు రవి.
ఇమ్మంది రవి అరెస్ట్ తర్వాత ఐబొమ్మతో పాటు, దానికి అనుబంధంగా ఉన్న బప్పం వెబ్సైట్లను డౌన్ చేశారు పోలీసులు. కానీ, పైరసీ పూర్తిగా ఆగిపోలేదు. టెలిగ్రామ్ ఛానెళ్లు, ఇతర టోరెంట్ సైట్ల ద్వారా కొత్త సినిమాల కంటెంట్ విచ్చలవిడిగా కనిపించింది. ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కలిసి వర్కవుట్ చేసి అరెస్ట్ చేయించిన ఇమంది రవి ఇప్పుడు చాలా ఈజీగా బెయిల్‌పై బైటికొచ్చాడు. రిమాండ్‌లో మనీ లాండరింగ్ సహా అనేక కేసులపై పోలీసులకొచ్చిన క్లారిటీ ఏంటి? బెయిల్ తర్వాత రవిపై నిఘా ఉంటుందా? 90రోజులైనా అయినా చార్జిషీట్ ఎందుకు వెయ్యలేదు? ఇలా మిగిలిన ప్రశ్నలు బోలెడన్ని. అటు, వాట్ నెక్ట్స్..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు లక్షలాది పైరసీప్రియులు.