IND vs NED : 6 సిక్సర్లు, 66 పరుగులు.. బౌలర్లను ఉతికి ఆరేసిన శివం దూబే..నెదర్లాండ్స్ టార్గెట్ 194

IND vs NED : 6 సిక్సర్లు, 66 పరుగులు.. బౌలర్లను ఉతికి ఆరేసిన శివం దూబే..నెదర్లాండ్స్ టార్గెట్ 194


IND vs NED : టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్ చివరి పోరులో టీమిండియా బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. శివం దూబే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో శివాలెత్తగా, హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో పసికూన నెదర్లాండ్స్ ముందు భారత్ 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ (అమెరికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్) ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ల హ్యాట్రిక్ నమోదు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఈషాన్ కిషన్ (18) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (31), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా భారీ స్కోర్లు చేయలేకపోయారు.

భారత్ 110 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో శివం దూబే అసలు సిసలు మజా చూపించాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన దూబే.. మొత్తం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 66 పరుగులు చేసి గ్రౌండ్‌ను హోరెత్తించాడు. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 30) కూడా ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు వేగంగా 70 పరుగులు జోడించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించారు.

నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ తన 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. లోగాన్ వాన్ బీక్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే సూపర్‌ 8 రౌండ్‌కు క్వాలిఫై అయిన టీమిండియా, తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఘనవిజయంతో ముగించి సౌతాఫ్రికాతో జరిగే తదుపరి పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలని చూస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *