నగరంలో మరో కొత్త రకం చీటింగ్ కేసు ఫైల్ అయింది. హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారినని చెప్పుకొని ఓ వ్యక్తి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు ఐఫోన్లు ఇస్తానని నమ్మించి ఓ 53 ఏళ్ల వ్యక్తి నుంచి రూ.75 వేలు నగదు తీసుకొని పరారయ్యాడు ఓ కేటుగాడు. బాధితుడి ఫిర్యాదుతో ఘటన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూల్‌డ్రింక్స్ షాప్ నిర్వహిస్తున్న గ్యామ్ ఆల్ఫ్రెడ్‌ను మంగళవారం ఓ వ్యక్తి సంప్రదించాడు. తాను హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారినని చెప్పిన అతడు.. రెండు ఐఫోన్లు తక్కువ ధరకే ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆల్ఫ్రెడ్ రెండు ఐఫోన్లను రూ.1 లక్షకు కొనుగోలు చేయడానికి అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ హైదరాబాద్ విమానాశ్రయ డిపార్చర్ ఏరియాలో కలుసుకున్నారు.
అక్కడ ఆల్ఫ్రెడ్ రూ.75 వేల నగదును ఆ వ్యక్తికి అందించాడు. అనంతరం ఫోన్లు తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆల్ఫ్రెడ్‌కు మోసం జరిగినట్లు అర్థమైంది. తక్షణమే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు RGIA పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.