ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు

ICC T20I Rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఈషాన్ కిషన్ సంచలనం.. టాప్-10లో నలుగురు భారతీయులు


ICC T20I Rankings : టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠగా సాగుతున్న వేళ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ తాజా జాబితాలో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. ముఖ్యంగా టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ ఏకంగా 17 స్థానాలను ఎగబాకి టాప్-10లోకి దూసుకొచ్చాడు. పాకిస్థాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఈషాన్ కిషన్‌కు భారీగా కలిసి రావడంతో అతను 8వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. మరోవైపు వరల్డ్ కప్‌లో వరుస డకౌట్లతో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ తన నంబర్ 1 స్థానాన్ని కాపాడుకోవడం విశేషం. 891 రేటింగ్ పాయింట్లతో అభిషేక్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నారు.

బ్యాటింగ్ విభాగంలో ఇతర భారత ఆటగాళ్లు కూడా మెరిశారు. తిలక్ వర్మ 4వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 6వ స్థానంలో కొనసాగుతున్నారు. శ్రీలంక బ్యాటర్ పతుమ్ నిస్సంక ఆస్ట్రేలియాపై సెంచరీతో మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 3వ ర్యాంకుకు చేరుకున్నారు. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ రెండు స్థానాలు దిగజారి 5వ స్థానానికి పడిపోయారు. ఇలా టాప్-10లో నలుగురు భారతీయులు ఉండటం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది.

బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 2వ స్థానానికి చేరుకోగా, అబ్రార్ అహ్మద్ మూడో స్థానంలో ఉన్నారు. జింబాబ్వే బౌలర్ బ్రాడ్ ఇవాన్స్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకును సొంతం చేసుకోవడం ఈ ర్యాంకింగ్స్‌లో అతిపెద్ద సంచలనంగా మారింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 8వ స్థానంలో, ముస్తాఫిజుర్ రెహమాన్ 9వ స్థానంలో నిలిచారు.

ఆల్‌రౌండర్ల విభాగంలో కూడా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ యువ సెన్సేషన్ సామ్ అయూబ్ నంబర్ 1 స్థానానికి చేరుకుని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజాను వెనక్కి నెట్టేశాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. నేపాల్ ఆటగాడు దీపేంద్ర సింగ్ ఐరీ 4వ స్థానానికి చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించగా, అఫ్గానిస్థాన్‌కు చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐదో స్థానంలో నిలిచారు. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉండటం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *