Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా విజయవంతంగా సూపర్ 8 రౌండ్‌లోకి అడుగుపెట్టింది. జట్టు మొత్తం ఫుల్ జోష్‌లో ఉన్నప్పటికీ, ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా డకౌట్ అవుతూ నిరాశపరుస్తున్న ఈ యువ ఆటగాడి భవిష్యత్తు సూపర్ 8లో ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతనికి పూర్తి మద్దతుగా నిలుస్తుండటం విశేషం.
అభిషేక్ శర్మ గణాంకాలు చూస్తుంటే పరిస్థితి కాస్త సీరియస్‌గానే కనిపిస్తోంది. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో అతను ఏకంగా నాలుగు సార్లు సున్నా (డకౌట్) పరుగులకే వెనుదిరిగాడు. ఇందులో రెండు సార్లు ఈ వరల్డ్ కప్ టోర్నీలోనే జరగడం గమనార్హం. మధ్యలో కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు కూడా అతను దూరమయ్యాడు. మొదటి బంతి నుంచే భారీ సిక్సర్లు, ఫోర్లు బాదడం అభిషేక్ శైలి. ఈ దూకుడు వల్లే అతను టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. కానీ అదే దూకుడు ఇప్పుడు అతనికి శాపంగా మారి వికెట్లు పారేసుకునేలా చేస్తోంది.
ఈ వరుస వైఫల్యాలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సిదాన్షు కోటక్ స్పందించారు. టీ20 లాంటి వేగవంతమైన ఫార్మాట్‌లో బ్యాటర్లు తక్కువ పరుగులకే అవుట్ అవ్వడం చాలా సాధారణ విషయమని ఆయన అన్నారు. దీని గురించి అతిగా విశ్లేషించి బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదని, అలా చేస్తే ప్రత్యర్థి కంటే మనమే ఎక్కువ అయోమయానికి గురవుతామని అభిప్రాయపడ్డారు. అభిషేక్ శర్మకు గేమ్ ప్లాన్ మీద పూర్తి స్పష్టత ఉందనీ, అనారోగ్యం పాలవ్వకముందు అతను అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని కోటక్ గుర్తుచేశారు.
టీ20 క్రికెట్‌లో 10 బంతుల్లో 30 పరుగులు చేయడం కూడా చాలా కీలకమని, అభిషేక్ అటాకింగ్ మోడ్‌లో ఉండటమే జట్టుకు ప్లస్ పాయింట్ అని కోచ్ పేర్కొన్నారు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఆడే పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం లేదని, పిచ్ స్వభావం మరియు పరిస్థితులను బట్టి ప్రణాళికలు మారుస్తామని తెలిపారు. మొత్తానికి సూపర్ 8లో కూడా అభిషేక్ శర్మ తనదైన శైలిలో విరుచుకుపడతాడని మేనేజ్మెంట్ గట్టి నమ్మకంతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..