
ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ తీపికబురు అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో సమ్మర్ మొదలైనట్లు కనిపిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు చలి పులి వణికించగా.. ఇప్పుడు ఆ తీవ్రత తగ్గి భానుడి భగభగలు మొదలవుతున్నాయి. ఎండకాలం వస్తున్న క్రమంలో ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో ప్రజలకు బస్సుల్లో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో ఛార్జీలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలో తిరిగే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మాత్రమే ఈ తగ్గింపు అమలు కానుంది. దీంతో నగరవాసులు ఎండ వేడి, ఉక్కబోత సమస్య నుంచి బయటపడనున్నారు.
ఏయే బస్సుల్లో అంటే..?
నగర పరిధిలో సేవలు అందించే సిటీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో అన్నింటిల్లోనూ 30 శాతం వరకు ఛార్జీలు తగ్గించనున్నారు. మార్చి 1వ తేదీ నుంచి మే నెలాఖరు వరకు ఈ తగ్గింపు అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఛార్జీ ఎక్కువగా వసూలు చేస్తుండగా.. ఈ తగ్గింపుతో మెట్రో ఎక్స్‌ప్రెస్ ఛార్జీలతో సమానంగా ఏసీ బస్సుల ఛార్జీలు ఉండనున్నాయి. అయితే మహిళలకు ఎప్పటిలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంటుంది. టికెట్ తీసుకుని ప్రయాణించేవారికి ఈ తగ్గింపుతో ఛార్జీల భారం తగ్గడంతో పాటు ఎండాకాలంలో సౌకర్యవంతమైన ప్రయాణం ఏసీ బస్సుల్లో లభించనుందని చెప్పవచ్చు. ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సర్వీసులు అందించే పుష్పక్ ఏసీ బస్సుల్లోనే 30 శాతం టికెట్ల ఛార్జీలను తగ్గించనున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరనుంది.
తగ్గనున్న ప్రయాణ ఖర్చు
ప్రస్తుతం నగర పరిధిలో అన్ని ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. వీటిల్లో ఏసీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. వీటిల్లో ప్రయాణికుల రద్దీ కూడా భారీగా ఉంటుంది. ఎండాకాలంలో ఏసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం హైదరాబాద్‌లోని ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మాత్రమే తగ్గింపు అమల్లో ఉంటుంది. మిగతా ప్రాంతాలకు తిరిగే ఏసీ బస్సులకు ఈ తగ్గింపు వర్తించదని ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అటు హైదరాబాద్‌లో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను నగరంలో తిప్పనుంది.