చారిత్రక విశేషాలు, ప్రాచీన కట్టడాలు పురాతన ఆలయాలకు నిలయం రాచకొండ. రాజులు గతించారు. రాచరికాలు అంతరించినా.. అలనాటి చారిత్రకకు సజీవ సాక్ష్యాలుగా కట్టడాలు, దేవాలయాలు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. కాకతీయుల తర్వాత రాచకొండ ప్రాంతంలో రేచర్ల పద్మ నాయకులు వెలమ వంశీయులు రాజ్యమేలారు. ముఖ్యంగా రాచకొండ గుట్టపై ఉన్న చారిత్రక ప్రదేశం ‘భోగిని మండపం’, దీనిని స్థానికులు “భోగందాని మంచం” అని పిలుస్తారు. సుమారు 600 ఏళ్ల క్రితం నాటి రేచర్ల పద్మనాయక రాజు సింగ భూపాలుడు భోగిని ప్రేమకు, ప్రణయగాథకు ఇది నిదర్శనంగా రెండు పెద్ద బండరాళ్ల మధ్య దీనిని నిర్మించారు. ఈ భోగిని మంటపంలో ఓ అరుదైన 9 అడుగుల ఎత్తైన తాంత్రిక భైరవుని అరుదైన శిల్పం వెలుగు చూసింది.
కొత్త తెలంగాణ చరిత్ర బృందం.. రాచకొండ గుట్టల్లో ఈ భైరవ శిల్పాన్ని గుర్తించారు. గుట్టల్లోని భోగందాని మంటపం, గణపతి శిల్పాల నడుమ పెద్ద రాతిగోడపై చెక్కి ఉన్న ఈ 9 అడుగుల ఎత్తయిన భైరవ శిల్పం ఎంతో ప్రత్యేకమైనదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. భారీ బండరాయి మీద చెక్కిన భైరవ ప్రతిమ 9 అడుగుల ఎత్తుంది. ఈ శిల్పంలో భైరవుడు ద్విభంగిమలో, వైతస్తిక పాదాలతో నిల్చున్న చతుర్భుజుడుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఈ చతుర్భుజుడి పరహస్తాల్లో ఢమరుకం, త్రిశూలాలు, నిజహస్తాల్లో బలి ఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సులున్నాయి.
శిరస్సు కింద రక్తం కోసం పైకి ఎగురుతున్న శునకం కనిపిస్తోంది. ఆ పక్కన ఓ భక్తుడు సాగిలపడి మొక్కుతున్నాడు. భైరవునికి కుడిపక్కన మరిగాలు పెట్టి, యోగబంధంతో కూర్చున్న రాజోపాసకుడు పాత్రలోని రక్తప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్టుగా చెక్కి ఉంది. భైరవుని తలమీద రెండుసర్పాలు అల్లుకున్న నాగతోరణం, నాగ కిరీటం, నోట్లో కోరలు, చెవులకు నాగాభరణాలు, మెడలో హార, గ్రైవేయకాలు, వక్షం, మోకాళ్లమీద నాగబంధాలు, చేతులకు కంకణాలు, కాలికి కడియాలు, ఎత్తులు కట్టిన పాదుకలున్నాయి. ఈ శిల్పం రాచకొండ వెలమల ‘రణంకుడుపు’లను గుర్తుచేస్తున్నదని కొత్త తెలంగాణ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ చెబుతున్నారు. రాచకొండ పాలకులు భైరవోపాసకులని, యుద్ధం ముగిసినతర్వాత శత్రువుల రక్తంతో వంట చేసి భైరవుడికి నైవేద్యం సమర్పించేవారీగా తెలుస్తోందని అన్నారు.