T20 World Cup 2026 : కంగారూల కొంప ముంచిన వాన.. 17 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు పరాభవం.. టోర్నీ నుంచి అవుట్

T20 World Cup 2026 : కంగారూల కొంప ముంచిన వాన.. 17 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు పరాభవం.. టోర్నీ నుంచి అవుట్


T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. పల్లెకెలెలో మంగళవారం (ఫిబ్రవరి 17) జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించగా, జింబాబ్వే మొత్తం 5 పాయింట్లతో గ్రూప్-బి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా ఆశలు గల్లంతయ్యాయి.

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన మ్యాచ్‌లలో జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ముఖ్యంగా జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆసీస్ కొంప ముంచింది. ఆ తర్వాత శ్రీలంకపై జరిగిన చావో రేవో పోరులో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గాయాల కారణంగా పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లు దూరం కావడం, కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయపడటం ఆ జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి. 17 ఏళ్ల తర్వాత (2009 తర్వాత) ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించడం ఇదే మొదటిసారి.

మరోవైపు జింబాబ్వే ఈ టోర్నీలో అద్భుతాలు చేస్తోంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం సృష్టించిన ఆ జట్టు, ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో లభించిన పాయింట్‌తో సూపర్-8 బెర్తును ఖరారు చేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో జింబాబ్వే టాప్-8 దశకు చేరుకోవడం ఇదే తొలిసారి. గ్రూప్-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే జట్లు ముందుకు సాగగా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

ఇక గ్రూప్-ఏ విషయానికొస్తే, పాకిస్థాన్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. బుధవారం (ఫిబ్రవరి 18) కొలంబో వేదికగా నమీబియాతో పాక్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే లేదా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా 5 పాయింట్లతో సూపర్-8కు చేరుకుంటుంది. ఒకవేళ నమీబియా చేతిలో పాక్ ఓడిపోతే, అప్పుడు 4 పాయింట్లతో ఉన్న అమెరికా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా సూపర్-8కు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కొలంబోలో వర్షం కురిసే అవకాశాలు 50-60% ఉండటంతో, వరుణుడు పాక్‌ను ఆదుకుంటాడో లేక అమెరికాకు అదృష్టం పట్టిస్తాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *