భారత క్రికెట్ లెజెండ్ యువరాజ్ సింగ్ పేరుతో పేరు పొందిన కెనడా యువ బ్యాట్స్‌మన్ యువరాజ్ సమ్రా (Yuvraj Samra) టీ20 వరల్డ్ కప్ 2026లో చరిత్ర సృష్టించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ డీ మ్యాచ్‌లో కేవలం 19 ఏళ్ల వయసులోనే అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోర్‌తో (65 బంతుల్లో 110 పరుగులు) యువరాజ్ సమ్రా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆస్ట్రేలియాపై పతుమ్ నిస్సాంకా చేసిన అజేయ 100 పరుగుల రికార్డును ఈ ఇన్నింగ్స్ అధిగమించింది.
19 సంవత్సరాలు 141 రోజులు వయసులోనే టీ20 వరల్డ్ కప్‌లో శతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా యువరాజ్ సమ్రా రికార్డు సృష్టించాడు. అనుభవజ్ఞులైన న్యూజిలాండ్ బౌలింగ్ దాడిని ఎదుర్కొని పరిపక్వతతో బ్యాటింగ్ చేసి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాళ్లు..
19y 141d – యువరాజ్ సమ్రా (కెనడా) vs న్యూజిలాండ్, చెన్నై, 2026*
22y 127d – అహ్మద్ షెహ్జాద్ (పాకిస్థాన్) vs బంగ్లాదేశ్, 2014
23y 156d – సురేశ్ రైనా (భారత్) vs దక్షిణాఫ్రికా, 2010
25y 83d – అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్) vs శ్రీలంక, 2014
25y 327d – గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) vs శ్రీలంక, 2022
అసోసియేట్ జట్లకు టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
110 – యువరాజ్ సమ్రా (కెనడా) vs న్యూజిలాండ్, చెన్నై, 2026*
94* – ఆరోన్ జోన్స్ (యూఎస్ఏ) vs కెనడా, 2024
86 – మైఖేల్ జోన్స్ (స్కాట్లాండ్) vs ఐర్లాండ్, 2022
84 – జార్జ్ మున్సీ (స్కాట్లాండ్) vs ఇటలీ, కోల్‌కతా, 2026
80* – ఆండ్రీస్ గౌస్ (యూఎస్ఏ) vs దక్షిణాఫ్రికా, 2024
యువరాజ్ సమ్రా ఎవరు?
కెనడాలోని బ్రాంప్టన్, ఒంటారియోలో జన్మించిన యువరాజ్ సమ్రాకు అతని తండ్రి బల్జీత్ భారత లెజెండ్ యువరాజ్ సింగ్‌కు పెద్ద అభిమానిగా ఉండటంతో ఆ పేరు పెట్టారు. యువరాజ్ సింగ్ ప్రభావంతోనే సమ్రా ఎడమచేతి బ్యాటింగ్‌ను అలవాటు చేసుకున్నాడు. పొడవైన కాయం కలిగిన ఈ యువ బ్యాట్స్‌మన్ అద్భుతంగా ఎదుగుతూ కెనడా టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించాడు.
టీ20 వరల్డ్ కప్ 2026లో అతి పిన్న వయస్కుడిగా ప్రవేశించిన యువరాజ్ సమ్రా, 2025 అమెరికాస్ క్వాలిఫయర్స్‌లో కేవలం 15 బంతుల్లో అర్ధశతకం చేసి తన ప్రతిభను ముందుగానే చూపించాడు.
మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయపడిన కలీమ్ సనా స్థానంలో శివమ్ శర్మను జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అనారోగ్యంతో దూరంగా ఉండటంతో డారిల్ మిచెల్ నాయకత్వం వహించాడు. కోల్ మెక్కాన్చీ సాంట్నర్ స్థానంలో, లాకీ ఫెర్గుసన్ స్థానంలో కైల్ జేమీసన్ జట్టులోకి వచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..