
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరోసారి అడవి మృగం సంచారం భయాన్ని రేకెత్తించింది. ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ పరిధిలో గిద్దగట్టు గుట్ట సమీపంలోని పంట పొలాల్లో అర్ధరాత్రి పెద్దపులి దాడి చేసి నాలుగు ఆవులను చంపేసిన ఘటన కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు మల్లయ్య తన మూడు ఆవులను, మరో రైతు సుధాకర్ ఒక ఆవును పొలాల్లో కట్టేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో అడవివైపు నుంచి వచ్చిన పెద్దపులి పశువులపై దాడి చేసి వాటిని చీల్చి చంపేసింది. ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు రక్తపు మరకలు, చీల్చివేయబడిన పశువులను చూసి షాక్‌కు గురయ్యారు. ఒక్కసారిగా ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల పులి అడుగుల ముద్రలు గుర్తించి ఇది పెద్దపులి దాడేనని నిర్ధారించారు. పులి గ్రామ పరిసరాల్లోనే తిరుగుతున్న అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రామస్తులు గుంపులుగా తిరగాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
ఒక్కసారిగా నాలుగు పశువులు మృతి చెందడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పశువులే తమ జీవనాధారం అని, వెంటనే పరిహారం అందించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పెద్దపులి గ్రామానికి సమీపానికే రావడంతో తిప్పాపూర్‌లో భయం నెలకొంది. పిల్లలను బయటకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతుండగా, రైతులు పొలాలకు వెళ్లడానికే వెనుకంజ వేస్తున్నారు. పులిని త్వరగా పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అటవీశాఖ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.