హైదరాబాద్ ప్రజలకు జీహెచ్‌ఎంసీ భారీ గుడ్‌న్యూస్ అందించింది. నగరంలో పార్కింగ్ సమస్యకు పరిష్కారం చేపేందుకు వినూత్న విధానాన్ని తీసుకొస్తుంది. ఈ మేరకు స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్ అనే ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మైజీహెచ్‌ఎంసీ మొబైల్ యాప్‌లో ప్రత్యేక లింక్‌ను తీసుకురానుంది. దీని ద్వారా స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని అమలు చేయనుంది. ఇది అమలు చేసేందుకు ఏజెన్సీల నుంచి జీహెచ్ఎంసీ టెండర్లు ఆహ్వానించగా.. అర్హత సాధించిన రెండు సంస్థలను ఎంపిక చేశారు. ఈ సంస్థల ద్వారా స్మార్ట్ పార్కింగ్ సుదుపాయం వాహనదారులకు కల్పించనున్నారు. దీని వల్ల నగరంలో పార్కింగ్ సమస్య కాస్త తీరనుంది. ప్రస్తుతం పార్కింగ్ సమస్య నగరంలో వేధిస్తోంది. ఖాళీ స్థలం లేక ఎక్కడికక్కడ వాహనాలను పార్క్ చేస్తుడటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.
స్మార్ట్ పార్కింగ్ సౌకర్యం ఎలా..?
తొలుత ఖైరతాబాద్ జోన్‌లో ఈ విధానాన్ని అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం 14 ప్రాంతాలను గుర్తించింది. ఈ ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాల్లో మార్కింగ్ లైన్ ఏర్పాటు చేశారు. ఎదురుగా సెన్సార్లను ఏర్పాటు చేస్తారు. ఇవి నిరంతంర ఖాళీగా ఉన్న పార్కింగ్ స్లాట్లను రికార్డ్ చేస్తాయి. ఆ సమాచారాన్ని మైజీహెచ్ఎంసీ యాప్‌తో లింక్ చేస్తాయి. వాహనదారులు ఈ సమాచారం ద్వారా తాము ఉన్న 500 మీటర్లలోపు ఎక్కడెక్కడ ఖాళీ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. పార్కింగ్ ఫీజు చెల్లించి ఖాళీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ పార్కింగ్ ప్రదేశాల్లో ఇందుకోసం పనులు చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో నగరంలో ఎక్కడికక్కడ ఇలాంటి స్మార్ట్ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఎక్కడెక్కడంటే..?
సోమాజిగూడ సీఎంఆర్ జ్యవెలరీ సమీపంలో షేక్ పేట్ పైవంతెన, సత్యం థియేటర్, మల్లేపల్లి వార్డు ఆఫీస్, నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్, సోమాజిగూడ ది పార్క్ హోటల్, స్టేట్ లైబ్రరీ ముందు, జీహెచ్‌ఎంసీ మెయిన్ ఆఫీస్, హిమయత్ నగర్, టీటీడీ ఆలయం, లిబర్టీ చౌరస్తాలోని వన్ ప్లస్ స్టోర్, అబిడ్స్‌లోని చర్మాస్, అబిడ్స్ బ్లూ స్టోర్ రెస్టారెంట్, తాజ్ మహల్ హోటల్, మెహిదీపట్నం పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ కింది భాగం, బషీర్ బాగ్ పైవంత నుంచి లిబర్టీ వరకు ఉన్న ప్రదేశాల్లో ఈ స్మార్ట్ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తోండగా.. రానున్న రోజుల్లో నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు అవుతాయి. దీంతో యాప్ సాయంతో వాహనదారులు పార్కింగ్ బుకింగ్ చేసుకోవచ్చు.