మహాశివరాత్రి పర్వదినం వేళ నిర్మల్ జిల్లాలో అద్భుతం జరిగింది. స్థానిక శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ,పరమేశ్వరుల కళ్యాణం జరుగుతున్న శుభసమయంలో ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని గొడిసెర్యాల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగుతోంది. భక్తులంతా తన్మయత్వంతో స్వామి, అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక నాగుపాము ఒక్కసారిగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమైంది. హోమగుండం, కల్యాణ వేదిక సమీపంలో గోదుమ వర్ణంలో మెరుస్తూ ఉన్న ఓ నాగుపాము, తానుకూడా తన స్వామి కళ్యాణం చూడ్డానికి వచ్చాను అన్నట్టుగా ఓ పక్కగా పడగ విప్పి నిల్చుని కళ్యాణం చూస్తుండటం చూసిన భక్తులు మొదట ఆశ్చర్యపోయారు. సాధారణంగా పామును చూస్తే భయపడే జనం, ఆ పవిత్ర సమయంలో అది కనిపించడంతో శివుడే నాగ రూపంలో దర్శనమిచ్చాడని భావించారు. కల్యాణ సమయంలో నాగుపాము రావడం శుభశకునమని భావించిన భక్తులు, దానికి ఎటువంటి హాని తలపెట్టకుండా భక్తితో నమస్కరించారు. “హర హర మహాదేవ.. శంభో శంకర” అంటూ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ నాగరూప శివుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలిరావడంతో గొడిసెర్యాల గ్రామం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. అంతా శివయ్య లీల అని, తమ గ్రామంపై స్వామివారి అనుగ్రహం ఉందనడానికి ఇదొక నిదర్శనమని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కోటి దీపాల వెలుగుల్లో..మహాశివరాత్రి వైభవం
Trisha Krishnan: అనవసర వివాదాల్లోకి లాగితే చట్టపరమైన చర్యలు
Gold Price Today: తగ్గిన బంగారం ధర.. కానీ వెండి ధరలు మాత్రం.?
చింతలమోరి శివాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
ఫిబ్రవరి 17న రాహుగ్రస్త సూర్యగ్రహణం… భారత్‌పై ఎఫెక్ట్ ఎంత