మహాశివరాత్రి పర్వదినాన ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రంతో యావత్ శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. ఈ శుభదినాన భోళాశంకరుడిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘పంచారామ క్షేత్రాల’ దర్శనానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అమృత ఘడియల్లో వెలిసిన ఈ ఐదు క్షేత్రాలను దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలమని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతి రమణీయతకు నెలవైన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నాలుగు క్షేత్రాలు కొలువై ఉన్నాయి. వాటిలో ఒకటి కృష్ణానది తీరాన అమరావతిలో విరాజిల్లుతోంది. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా ఇంద్రుడే ప్రతిష్టించారని చెబుతారు. పంచారామ క్షేత్రాల్లో మొదటి పుణ్యక్షేత్రంగా స్వామివారు అమరేశ్వరస్వామిగా పూజలందుకుంటారు. పంచారామాల్లో రెండో క్షేత్రం.. ద్రాక్షారామం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘దక్షిణ కాశీ’గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడి లింగం 14 అడుగుల ఎత్తుతో అలరారుతుంటుంది. తూర్పు చాళుక్య రాజు అయిన భీముడు ఈ లింగాన్ని ప్రతిష్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి. పంచారామాల్లో మూడో క్షేత్రం సామర్లకోటలోని కుమారారామం. కుమారస్వామి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించిన చోటు. ఇక్కడ స్వామివారు కుమార భీమేశ్వర స్వామిగా కొలువై ఉండి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. అమ్మవారు ‘బాలా త్రిపురసుందరి’గా పూజలు అందుకుంటున్నారు. పంచారామాల్లో నాలుగో క్షేత్రం పాలకొల్లులోని క్షీరారామం. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో వెలిసిన ఈ క్షేత్రంలో రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ శివలింగాన్ని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. పంచారామాల్లో ఐదవ క్షేత్రం పశ్చిగోదావరి జిల్లా భీమవరంలోని సోమారామం. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించినట్లుగా చెబుతారు. ఈ ఆలయంలోని శివలింగం అమావాస్యకు నలుపు వర్ణంలోకి, పౌర్ణమికి తెలుపు వర్ణంలోకి మారుతుండటం ఇక్కడి మరో విశిష్టత. ఇక్కడ అన్నాపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది. మహాశివరాత్రి వంటి రద్దీ రోజుల్లో కాకపోయినా, కార్తీక మాసంలో లేదా ఇతర శుభ దినాల్లో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు ఈ ఐదు క్షేత్రాలను దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. ఇలా ఒకే రోజు ఐదు ఆరామాలను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి, మోక్షం సిద్ధిస్తుందని శాస్త్ర వచనం. లింగోద్భవ కాలంలో ఆ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ, ఈ పంచారామ క్షేత్రాల వైభవాన్ని తలచుకోవడం కూడా పుణ్యప్రదమే. భక్తి పారవశ్యంతో సాగే ఈ యాత్ర భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహాశివరాత్రి రద్దీలో చోరీ.. కీసరగుట్టలో రెచ్చిపోయిన దొంగలు
అర్ధరాత్రి వేళ భక్తుడి ప్రాణాలు కాపాడిన అటవీ సిబ్బంది
Bhainsa Municipality: 20 ఏళ్ల తర్వాత భైంసాలో గెలిచిన బీజేపీ
Adilabad Municipality: ఆదిలాబాద్లో కుర్చీ కోసం కలిసిపోయిన అన్ని పార్టీలు
చాక్పీస్పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా