వ్యాధులను తొలగించే ‘మరకత లింగం’.. హైదరాబాద్ శివారులో అరుదైన శివాలయం

వ్యాధులను తొలగించే ‘మరకత లింగం’.. హైదరాబాద్ శివారులో అరుదైన శివాలయం


తన భక్తులను అనుగ్రహించేందుకు పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడని పురాణాలు చెబుతాయి. ఆ ద్వాదశ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేక స్థానం పొందింది. అక్కడ వైద్య నాథేశ్వరుడిగా కొలువుదీరిన శివుడు భక్తులకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడనే విశ్వాసం ఉంది. ఆ పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రంతో మెరిసే మరకత శివలింగం తెలంగాణలోని చందిప్ప గ్రామంలో దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు నివృత్తి అవుతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

చందిప్ప క్షేత్రం చరిత్ర

శివలింగం పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం వంటి అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. వాటిలో మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రకాశిస్తూ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి అరుదైన మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రా(Chandippa Marakatha Shiva Temple
)నికి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఉన్న ఈ పవిత్ర స్థలంలో క్రీ.శ. 1076–1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. క్రీ.శ. 1101 కార్తిక శుద్ధ పంచమి గురువారం ప్రతిష్ఠోత్సవం నిర్వహించబడినట్లు అదే శాసనంలో లిఖితంగా ఉంది.

కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. అయితే సుమారు పదిహేను సంవత్సరాల క్రితం కొందరు భక్తులు పునరుద్ధరణకు పూనుకుని నూతన గర్భగుడిని నిర్మించి ఆలయానికి మళ్లీ జీవం పోశారు.

ఆరోగ్య ప్రదాత మరకత సోమేశ్వరుడు

పర్లి వైద్యనాథ జ్యోతిర్లింగానికి, చందిప్ప మరకత లింగానికి పోలికలు ఉన్నాయని పండితులు పేర్కొంటారు. చందిప్ప శివయ్యను భక్తితో ఆరాధిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. శివుడు అభిషేకప్రియుడు కాబట్టి ఐదు సోమవారాలు, ఐదు పౌర్ణములు లేదా ఐదు మాస శివరాత్రులు మరకత లింగాన్ని అర్చిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. పౌర్ణమి రోజున లింగాభిషేక జలాలతో స్నానం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని, బ్రాహ్మీ ముహూర్తంలో అభిషేకం చేస్తే పరమశివుని కటాక్షం సిద్ధిస్తుందని స్థానిక ఐతిహ్యం చెబుతుంది.

క్షేత్రపాలకుడు కాలభైరవుడు

ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు వెలసి ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలోని కాలభైరవుడు ఆవరణాన్ని వెయ్యి కళ్లతో రక్షిస్తాడని నమ్మకం. ఆదివారం ఆయనను పూజిస్తే సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయని స్థలపురాణం. అలాగే శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి నాగరూపంలో ఇక్కడ సంచరిస్తాడనే ప్రతీతి ఉంది.

2007లో సూర్య కిరణాలు పడటంతో..

తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఒకప్పుడు నిరాదరణకు గురైన ఈ ఆలయం 2007లో శివరాత్రి సందర్భంగా జరిగిన సంఘటనతో మళ్లీ ప్రాచుర్యం పొందింది. అభిషేక సమయంలో శివలింగంపై పడిన సూర్యకిరణాలు పరావర్తనం కావడంతో అది మరకత లింగమని గుర్తించబడింది. అప్పటి నుంచి భక్తుల సహకారంతో ఆలయం మరింత అభివృద్ధి చెందుతోంది.

శ్రావణం, కార్తిక మాసాల్లో ప్రత్యేక పూజలు, మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌కు సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం వారాంత విహారయాత్రకు అనువైన ఆధ్యాత్మిక స్థలం. శంకర్‌పల్లి వరకు బస్సులో వెళ్లి, అక్కడి నుంచి ఆటోల ద్వారా చందిప్ప చేరుకోవచ్చు. మీరు ఒకసారి ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని దర్శించి తరించండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *