అమరావతి, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహనకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ 5,31,275 విద్యార్థులు, సెకండ్ ఇయర్లో 5,26,624 మంది వరకు విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. అంటే మొత్తం 10,57,899 మంది పరీక్షలకు హాజరు కానున్నారన్నమాట. అయితే ఈ ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫస్ట్ ఇయర్ సిలబస్‌తోపాటు ప్రశ్నపత్రాల విధానంలోనూ కీలక మార్పులు తీసుకొచ్చారు. సమాధానాలు రాయడానికి ఇప్పటి వరకు 24 పేజీల బుక్లెట్ ఇచ్చేవారు. అయితే ఈసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నట్లు బోర్డు తెలిపింది. క్వశ్చన్ పేపర్లోని అన్ని ప్రశ్నలకు అందులోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. బుక్లెట్ నిండిన వారికి అదనంగా ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వరు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ప్రశ్నల సంఖ్య పెరగడమే అందుకు కారణం. ఇందుకు అనుగుణంగా బుక్‌లెట్‌లో పేజీలు కూడా పెంచారు. ఛాయిస్ లేకుండా క్వశ్చన్ పేపర్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసినా 28 పేజీలు సరిపోతాయి. అందుకోసమే 32 పేజీల బుక్లెట్ తీసుకొచ్చినట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం గతంలో మాదిరిగానే 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. గతంలో బోటనీ, జువాలజీలకు విడివిడిగా పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి రెండింటినీ కలిపి బయాలజీగా ఒక్క ప్రశ్నపత్రమే ఇస్తారు. పార్ట్-ఏలో వృక్ష శాస్త్రం నుంచి 43, పార్ట్ బీలో జంతుశాస్త్రం నుంచి 42 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. వీటికి విడివిడిగా 24 పేజీల రెండు బుక్లెట్లు ఇస్తారు. బుక్లెట్లపై వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం అని ప్రత్యేకంగా ఉంటుంది.
అంతేకాకుండా ఈ ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు ఒక్క మార్కు ప్రశ్నలు ఉంటాయి. సెకండ్ ఇయర్ విద్యార్ధులకు మాత్రం ప్రశ్నపత్రాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్ సబ్జెక్టులకు కూడా ప్రశ్నల సంఖ్య పెరగడంతో వీటికి సైతం 32 పేజీల బుక్లెట్ ఇస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు ఫస్ట్ ఇయర్లో 85 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. వీటిల్లో 35 శాతం మార్కులొస్తేనే పాసైనట్లు పరిగణిస్తారు. అంటే ఒక్కో సబ్జెక్టులో 29 మార్కులు రావాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్లో 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలకు కలిపి 35 శాతం కింద అంటే 59.5 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.