కర్నూలుకు చెందిన వలీ కోవా బన్ను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలోనూ ఓ చిన్న బండిపై కోవా బన్ను అమ్ముతూ కొందరు యూట్యూబర్ల కంట పడ్డాడు. అయితే వారు వలితో ప్రవర్తించిన తీరు , కోవా బన్ను మీద అనుమానాలు రేకెత్తించిలా వ్యవహరించిన తీరు నెట్టింట బాగా వైరలయ్యింది. లైకులు, షేర్ల కోసం యూట్యూబ్ ఛానెల్స్ ఓ చిరు వ్యాపారిని ఇబ్బందులు పెట్టడం తగదంటూ ఆ యూబ్యూటర్లపై మండిపడ్డారు నెటిజన్లు. మరోవైపు వలీకి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. నారా లోకేశ్, పరిటాల లోకేశ్, అసదుద్దీన్ ఒవైసీ వంటి రాజకీయ, సినీ ప్రముఖులు వలికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఏపీ ఎమ్మెల్సీ, ప్రముఖ సినీ నటుడు నాగబాబు వలిని కలిశారు. అతనికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు చేతనైతే చిరు వ్యాపారులకు అండగా నిలవాలని, అంతే కానీ వారి పొట్ట కొట్టొద్దని హితవు పలికారు.
ఈ మేరకు కోవా బన్ వలితో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన నాగబాబు.. ‘చిరువ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది. పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడుని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ వ్యక్తి బాధను అర్థం చేసుకుని వ్యక్తిగతంగా రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించాం. చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. వలి లాంటి చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు, ఎం.ఎస్.ఎం.ఈ. శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చిరువ్యాపారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం కూడా ఆనందంగా ఉంది. ఈ సంఘటనను మతం కోణంలో చూడొద్దని కోరుతున్నా. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు వెళ్లతీసుకోవడం చిరువ్యాపారుల లక్ష్యం. పెద్దగా మూలధనం లేకపోయినా, తమకాళ్లపై తాము నిలబడాలనే ఆలోచనతో కూడళ్లలో, ఎక్కువ జనసంద్రం ఉండే జాతర్లలో, చిన్నచిన్న దుకాణాలు పెట్టుకొని చిరుతిండి పదార్థాలు అమ్ముకుని జీవనం సాగించే వారు మనదేశంలో కోట్లమంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40 శాతానికి పైగా పేద ప్రజలు చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల మీదనే ఆధార పడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
కోవా బన్ వలితో నాగ బాబు..
చిరువ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది
పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవాబన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడుని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరువ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం… pic.twitter.com/HbsnzrcaxR
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 15, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.