Mahashivratri 2026: ఇషా మహాశివరాత్రి 2026.. లక్షల మందితో కిక్కిరిసిన ఆదియోగి ప్రాంగణం

Mahashivratri 2026: ఇషా మహాశివరాత్రి 2026.. లక్షల మందితో కిక్కిరిసిన ఆదియోగి ప్రాంగణం


ఇషా యోగా సెంటర్‌లో నిర్వహించిన మహాశివరాత్రి 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. గంగా థీమ్‌తో నిర్వహించిన ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యక్షంగా మాత్రమే కాదు.. ఆన్‌లైన్ ద్వారా కూడా కోట్లాది మంది ఈ శివరాత్రి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. భారతీయ సంస్కృతి-రక్షణ వ్యవస్థల మధ్య ఉన్న బంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. “సంక్షోభ సమయాల్లో మన సైన్యం శివుడి లాంటి కరుణతో మానవతా సహాయం చేస్తుంది. అదే సమయంలో.. అవసరం అయితే రుద్రుడి తీవ్రతతో ‘ఆపరేషన్ సిందూర్’ వంటి ఆపరేషన్లు అమలు చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. “ఇక్కడ నేను అనుభవిస్తున్న దివ్యానుభూతి.. ఎవరు చెప్పకపోయినా.. ఈ స్థలం మహాదేవుడి ఆశీస్సులతో నిండిపోయిందని స్పష్టంగా చెబుతోంది” అని రాజ్‌నాథ్ సింగ్ భావోద్వేగంతో అన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, పుదుచ్చేరి హోంమంత్రి ఎ. నమశివాయం, కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపీ తదితరులు పాల్గొన్నారు.

సెలబ్రిటీల సందడి

ఆధ్యాత్మిక వాతావరణానికి గ్లామర్‌ టచ్‌ ఇచ్చేలా పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. తమన్నా భాటియా, జూహీ చావ్లా, మౌనీ రాయ్, సలీం మర్చంట్, తనిషా, సారా అర్జున్, వెంకటేష్ ప్రసాద్ తదితరులు భక్తులతో కలిసి శంభో నినాదాలతో శివరాత్రిని జరుపుకున్నారు.

“ఆదియోగి గతం కాదు.. భవిష్యత్తు” : సద్గురు

సద్గురు తన ప్రసంగంలో.. ఆదియోగి ప్రాధాన్యతను ప్రత్యేకంగా వివరించారు. ఆదియోగి గతానికి చెందినది కాదు. ఆదియోగి భవిష్యత్తుకు చెందినది. ఆయన ఇచ్చింది నమ్మక వ్యవస్థలు కాదు.. తత్వాలు కాదు.. శ్రేయస్సుకు సంబంధించిన టెక్నాలజీలు అని పేర్కొన్నారు.
రాబోయే 10-20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా “వెల్‌బీయింగ్ టెక్నాలజీలు” ప్రధాన శక్తిగా మారాలని ఇషా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. పైకి చూడడం కాదు.. లోపలికి చూడాలి. లోపలే మార్గంమని అన్నారు.

భవ్య భారత్ భూషణ్ అవార్డుల ఆవిష్కరణ

ఈ ఏడాది ఇషా మహాశివరాత్రిలో తొలిసారిగా ‘భవ్య భారత్ భూషణ్’ అవార్డులను ప్రారంభించారు. దేశ భవిష్యత్తును నిర్మించే అసాధారణ వ్యక్తులను గుర్తించి గౌరవించడమే ఈ అవార్డు ఉద్దేశమని సద్గురు తెలిపారు.

ఈ ఏడాది ఎంపికైన ప్రముఖులు:

నంబి నారాయణన్, కిరణ్ కుమార్ – సైన్స్ & టెక్నాలజీ

అలర్మేల్ వల్లి – నృత్యం

ఎన్. రాజం – సంగీతం

విక్రమ్ సంపత్ – చరిత్ర & సంస్కృతి

సైనా నెహ్వాల్ – క్రీడలు

ఆపరేషన్ సిందూర్‌లో సేవలకుగాను భారత సైనిక దళాల ప్రతినిధులు:

ఎయిర్ ఫోర్స్: ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రా

ఆర్మీ: లె.జెన్. ఏవీఎస్ రాథీ

నేవీ: వైస్ అడ్మిరల్ ఆర్.వి. గోఖలే

చరిత్రాత్మక ‘యోగేశ్వర లింగ మహాభిషేకం’

ఇషాలో తొలిసారిగా సద్గురు యోగేశ్వర లింగ మహాభిషేకం నిర్వహించారు. ఈ మహాభిషేకం ద్వారా భక్తులు యోగేశ్వర లింగంతో మరింత లోతైన అనుసంధానాన్ని పొందే అవకాశం కలుగుతుందని ఇషా పేర్కొంది. ఈ ఉచిత ఆధ్యాత్మిక ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు. ఇది ఇషా నిర్వహించిన అతిపెద్ద గ్లోబల్ పార్టిసిపేషన్ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.

రాత్రంతా సద్గురు నేతృత్వంలో ధ్యానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు సాగాయి. ఆదిత్య గాధ్వి, ప్రశాంత్ సోనగ్రా, స్వరూప్ ఖాన్, బ్లీజ్ వంటి కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “సౌండ్స్ ఆఫ్ ఇషా” బృందం ప్రదర్శనలతో ప్రాంగణం శివమయమైంది. అర్ధరాత్రి సమయంలో మహామంత్ర జపం మార్మోగగా.. లక్షలాది మంది భక్తులు ఒకే శ్వాసలో శివ తత్వాన్ని అనుభవించారు.

25 భాషల్లో లైవ్ ప్రసారం.. సంకేత భాషలోనూ ప్రసారం

ఇషా మహాశివరాత్రి 2026 వేడుకలు ఈసారి ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తృతంగా ప్రసారం అయ్యాయి. మొత్తం 25 భాషల్లో లైవ్ టెలికాస్ట్ నిర్వహించగా.. చెవిటి, వినికిడి సమస్యలున్నవారి కోసం సంకేత భాషలో కూడా ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా టీవీ ఛానెల్స్‌, డిజిటల్ ప్లాట్‌ఫాంల ద్వారా ఈ వేడుకలు 15 కోట్ల (150 మిలియన్ల) మందికి పైగా చేరినట్లు అంచనా. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ‘ఇన్‌క్లూజివ్’ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా మరోసారి నిలిచింది.

ఫిబ్రవరి 18 వరకు ఉచిత ‘ఇన్నర్ ఇంజినీరింగ్’

శివరాత్రి పవిత్ర రాత్రి సందర్భంగా సద్గురు మరో కీలక ప్రకటన చేశారు. అందరికీ అందుబాటులో ఉండేలా ‘ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్’ ఉచిత ఆఫర్‌ను ప్రకటించారు. ఈ అవకాశం ఫిబ్రవరి 18, 2026 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఈ ఏడాది చివర్లో ‘కాళభైరవ’ ప్రతిష్ఠ

ఇషా యోగా సెంటర్‌లో కాళభైరవ ప్రతిష్ఠ ఈ ఏడాది చివర్లో జరగనున్నట్లు సద్గురు వెల్లడించారు. ఇది ఇషా ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుందని పేర్కొన్నారు.

ఇషా శివరాత్రి వేడుకలు ఫోటోలు, వీడియోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *