బిర్యానీలో చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది జ్యూసీ చికెన్ లెగ్ పీస్. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ముక్క కోసం పోటీపడతారు. అయితే ఈ రుచికరమైన చికెన్ పీస్ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనే దాని గురించి తప్పక తెలుసుకోవాలి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చికెన్ లెగ్ ముక్కలలో ప్రోటీన్‌తోపాటు దాదాపు 12 రకాల విటమిన్లు ఖనిజాలు ఉన్నప్పటికీ, అవి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి సైలెంట్ కిల్లర్‌లా ప్రాణాలను హరిస్తాయట.
చికెన్ లెగ్ ముక్కల్లో ముదురు మాంసం ఉంటుంది. తెల్ల మాంసంతో పోలిస్తే చికెన్ లెగ్ పీస్‌లో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి.
లెగ్ ముక్కల్లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారు, డైట్ ఫాలో అవుతున్నవారు లెగ్ పీసెస్ తినకుండా ఉండాలి. వీటిలో ఉండే అదనపు కేలరీలు వేగంగా బరువు పెరగడానికి దారితీస్తాయి.
డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో కొవ్వు పరిమాణాన్ని నియంత్రించుకోవాలి. చికెన్ అధికంగా తీసుకోవడం వల్ల జీవక్రియపై ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు ఆటంకం కలిగిస్తుంది.




