ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది? 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. !

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది?  5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సస్పెన్స్.. !


తెలంగాణలో మున్సిపల్‌ పోరు ముగిసి మూడు రోజులు అవుతున్నా పొలిటికల్ డ్రామా మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఐదు మున్సిపాలిటీలు.. హంగ్ పాలిటిక్స్‌తో హీట్‌ పెంచుతున్నాయి. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ మధ్య క్యాంప్‌ పాలిటిక్స్‌ కాక రేపుతున్నాయి. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి హంగ్‌ మున్సిపాలిటీలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టడం హంగ్‌ రాజకీయం నెక్ట్స్‌ లెవల్‌కు చేరుతోంది. ఇంతకీ.. ఉమ్మడి వరంగల్‌లోని హంగ్‌ మున్సిపాలిటీల్లోని ప్రెజెంట్‌ సిచ్యువేషన్‌ ఏంటి..?

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 12 మున్సిపాలిటీలకు సంబంధించి హోరాహోరీగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఏడింటిని అధికార కాంగ్రెస్‌ ఫుల్‌ మెజార్టీతో కైవసం చేసుకుంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌, నర్సంపేట, పరకాల, డోర్నకల్, మరిపెడ, భూపాలపల్లి, ములుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మిగతా ఐదు మున్సిపాలిటీల్లో హంగ్‌ ఏర్పడింది. మహబూబాబాద్‌, వర్ధన్నపేట, జనగామ, తొర్రూరు, కేసముద్రం.. ఈ ఐదు మున్సిపాలిటీల్లో హంగ్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ చోట్ల కాంగ్రెస్, BRS మధ్య ఛైర్మన్‌, చైర్‌పర్సన్ కుర్చీలు దోబూచులాడుతున్నాయి. హంగ్‌ మున్సిపాలిటీల్లో ఎక్స్​అఫీషియో ఓటర్లు, స్వతంత్ర అభ్యర్థులే కీలకమయ్యారు.

హంగ్‌ వచ్చిన ఐదు మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్‌ ఛాలెంజ్‌గా తీసుకుంది. ముఖ్యంగా.. 36 వార్డులున్న ​మహబూబాబాద్​ మున్సిపాలిటీలో చైర్మన్ ​పదవి కాంగ్రెస్‌కు దక్కాలంటే కమ్యూనిస్టుల మద్దతు కీలకంగా మారింది. అయితే.. ముగ్గురు కౌన్సిలర్లు ఉన్న సీపీఐ.. బీఆర్ఎస్​ వైపు మొగ్గు చూపుతోంది. అటు.. జనగామలోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ బలాబలాల్లో ఒక్క ఓటే తేడా ఉంది. 15వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి పాండు కింగ్‌మేకర్ అయ్యారు. దొరికిందే ఛాన్స్‌ అన్నట్లుగా ఛైర్మన్ కుర్చీ ఇచ్చిన పార్టీకే ఓటు వేస్తానని మంకుపట్టు పట్టడం ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీల్లోని ఇండిపెండెంట్లకు ప్రధాన పార్టీల నేతలు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. ఆయా పార్టీల సొంత పార్టీ కౌన్సిలర్లకు బుజ్జగింపులూ కొనసాగుతున్నాయి.

మరోవైపు… వర్థన్నపేట మున్సిపాలిటీలోనూ గేమ్ మరింత రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ ఒక్కగానొక్క ఇండిపెండెంట్ కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో సీట్లు సమానం అయ్యాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ.. ఎక్స్‌అఫీషియో ఓటుతో గట్టెక్కాలని చూస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీపై కాంగ్రెస్ నేతలు కన్నేశారు. తొర్రూర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులుంటే.. BRS – 9, కాంగ్రెస్ 7 వార్డుల్లో గెలిచింది. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ పరిధిలోని తొర్రూరును కాంగ్రెస్‌ సవాల్‌గా తీసుకుంది. ఎలాగైనా కాంగ్రెస్‌ హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అటు.. పార్టీ కౌన్సిలర్లను కాపాడుకోవడం ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పెద్ద సమస్యగా తయారైంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి గెలిచిన కౌన్సిలర్లు ఇప్పటికీ రహస్య క్యాంపుల్లోనే మకాం వేశారు.

ఇదిలావుంటే.. BRS పార్టీ ఇద్దరు కౌన్సిలర్లు.. కాంగ్రెస్‌ టచ్‌లోకి వెళ్లారనే ప్రచారంతో 9మంది కౌన్సిలర్లతో క్యాంప్‌ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు వీడియో రిలీజ్‌ చేశారు. తొర్రూరు BRS కౌన్సిలర్ల విషయంలో అసత్య ప్రచారం జరుగుతుందన్నారు. 9మంది కౌన్సిలర్లు తమతోనే ఉన్నారని ప్రకటించారు. తొర్రూరు మున్సిపాలిటీని ఎట్టి పరిస్థితుల్లోనూ BRS కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎర్రబెల్లి దయాకర్‌రావు.

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి హంగ్‌ మున్సిపాలిటీలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఐదు హంగ్‌ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు భారీ ఆఫర్లతో యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేస్తుండడం మరింత కాక రేపుతోంది. మొత్తంగా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హంగ్ మున్సిపాలిటీలు హాట్‌టాపిక్‌గా మారాయి. హంగ్‌ వచ్చిన ఐదు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, BRS స్కెచ్చుల మీద స్కెచ్‌లు వేస్తుండడం హీట్‌ పెంచుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *