ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలుపు కోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతారు. విజయం కొందరిని మాత్రమే వరిస్తుంది. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు.. తాము ఇచ్చిన గిఫ్ట్‌లను తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను బెదిరిస్తున్నారు. దీంతో ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బు, బహుమతులను ఓటర్లు తిరిగి ఇచ్చేస్తున్నారు. అంతేకాదు.. గిఫ్ట్‌లను రోడ్డుపై పడవేసి కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. బెదిరింపులకు దిగిన అభ్యర్థులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఇది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో ఒకటవ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పలబోజు స్వరూపరాణి పోటీ చేశారు. ఇంటింటి ప్రచారం చేయడంతో పాటు తమకు ఓటు వేయాలంటూ వార్డు వాసులకు హాట్ బాక్సులు, చీరలను గిఫ్టులుగా ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో స్వరూపరాణి ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి జీర్ణించుకోలేని స్వరూప రాణి కుటుంబ సభ్యులు ఒకటవ వార్డులోని పలు కాలనీలోని ఇళ్లపై ఖాళీ సీసాలతో దాడులు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీ వాసులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమకు గిఫ్ట్‌లుగా ఇచ్చిన చీరలు, హాట్ బాక్స్‌లను నడిరోడ్డుపై పడవేశారు. మేము అడగకుండా మాకు గిఫ్ట్ లు ఇచ్చి.. ఇపుడు గొడవ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వరూపరాణి కుటుంబ సభ్యుల అరాచకాలు నశించాలంటూ కాలనీ వాసులు ధర్నా చేశారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. తమను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..