నటి ఇనయా సుల్తానా ఇటీవల రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసిన డాన్స్ వీడియోతో ఒక్కసారిగా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె ఎదుర్కొన్న వ్యక్తిగత సవాళ్లను, సినీ రంగంలో ఆమె ప్రయాణాన్ని గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆర్జీవీతో జరిగిన తన పుట్టినరోజు వేడుకలో డాన్స్ చేసిన తర్వాత వీడియో అనుకోకుండా వైరల్ అయిందని ఇనయా తెలిపారు. దీని ప్రభావం తన కుటుంబంపై తీవ్రంగా పడిందని, వారు తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ మద్దతు లేకుండానే సినీ రంగంలోకి ప్రవేశించిన ఇనయా, చిన్నతనం నుండి నటిగా ఎదగాలని కలలు కన్నారు.
ఆమె ఇంటి నుండి బయటకు రావడాన్ని కుటుంబం అంగీకరించలేదని, ముఖ్యంగా వైరల్ వీడియో తర్వాత బంధువులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారని ఆమె చెప్పారు. ఇంటి నుండి కేవలం రూ.100తో బయలుదేరిన ఇనయా, హైదరాబాద్‌లో హాస్టల్ ఫీజుల కోసం చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ చాలా కష్టాలు అనుభవించారు.
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని, అనేక అవకాశాలను వదులుకున్నానని ఇనయా సుల్తానా ధైర్యంగా తెలిపారు. అయితే, ప్రస్తుతం తాను ఎలాంటి కమిట్మెంట్లు లేకుండా మంచి ప్రాజెక్టులలో నటిస్తున్నానని, ఇండస్ట్రీలో నిజాయితీగా రాణించవచ్చని తాను నిరూపించాలనుకుంటున్నానని ఆమె చెప్పారు.
తన అమ్మ తన వల్ల బాధపడుతోందని, ఆమె కన్నీళ్లు తనకు తెలుసని ఇనయా సుల్తానా కంటతడి పెట్టుకున్నారు. తాను పడుతున్న బాధను ఎవ్వరూ అర్థం చేసుకోలేదని, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చూసి అందరూ తాను సంతోషంగా ఉన్నానని అనుకుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.




