శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి వ్యర్థాలను వడపోస్తూ, రక్తపోటు నియంత్రించడం, లవణాలను శరీరంలో సమతుల్యం చేసుకోవడం వంటి ముఖ్యమైన పనులు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 మిలియన్ల మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పలు పరిశోధనలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో, మనం రోజూ చేసే కొన్ని చిన్న అలవాట్లు కిడ్నీల ఆరోగ్యంపై సీరియస్ ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉదయం నీళ్లు తాగకపోవడం..
రాత్రంతా నిద్రపోతున్న సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఉదయం లేవగానే నీళ్లు తాగకపోతే.. కిడ్నీలు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్స్ విడుదల కాకుండా మిగిలిపోతాయి. కాబట్టి, ఉదయాన్నే ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోవడమే కాక, కిడ్నీలు సజావుగా పనిచేస్తాయి. European Journal of Pharmaceutical and Medical Research ప్రకారం.. గోరువెచ్చని నీరు తాగడం మూత్రపిండాలను మరింత మెరుగ్గా పనిచేయించడంలో సహాయపడుతుంది.
2. మూత్రాన్ని ఆపుకోవడం..
నిద్ర లేచిన తర్వాత బద్ధకంతో లేదా పనుల కారణంగా చాలామంది మూత్రాన్ని ఆపేస్తారు. కానీ, దీన్ని ఆపడం కిడ్నీలకు హానికరం. నిద్రపోయినప్పుడు మూత్రాశయం పొడిగించబడుతుంది, అది త్వరగా పూర్తిగా ఖాళీ కావాలి. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపడం వల్ల మూత్రాశయం, మూత్రపిండాలు రెండింటిపై ఒత్తిడి పెరుగుతుంది. National Library of Medicine ప్రకారం.. దీని వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది, అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.
3. పరగడుపున పెయిన్ కిల్లర్స్ వాడటం..
తలనొప్పి లేదా కండరాల నొప్పులను నివారించేందుకు చాలామంది నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs) ఉపయోగిస్తారు. అయితే, పరగడుపున ఆహారం లేకుండా వీటిని వాడటం కిడ్నీలకు నష్టం కలిగిస్తుంది. ఈ మందులు ఆహారం లేకుండా తీసుకుంటే.. అవి శరీరంలో త్వరగా శోషించబడతాయి, దీనివల్ల కిడ్నీ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. National Kidney Foundation ప్రకారం.. ఈ మందులు మూత్రపిండాలకు తీవ్రమైన హానిని కలిగిస్తాయి.
4. వ్యాయామం తర్వాత నీళ్లు తాగకపోవడం..
ఉదయం వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది. కానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో శరీరంలోని ద్రవాలు కోల్పోతారు. వాటిని తిరిగి భర్తీ చేయకపోవడం డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాదు, ఎలక్ట్రోలైట్స్ కలిగిన పానీయాలు తీసుకోవడం కూడా అవసరం. National Library of Medicine ప్రకారం.. రీహైడ్రేషన్ ప్రక్రియతో కిడ్నీలకు మంచి రక్తప్రసరణ లభించి, ఒత్తిడి తగ్గుతుంది.
5. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం..
బ్రేక్‌ఫాస్ట్ మానడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. దీని తర్వాత అధిక సోడియం ఉన్న జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ సోడియం తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. National Library of Medicine ప్రకారం.. అలాంటి ఆహారం కిడ్నీలకు నష్టం కలిగిస్తుంది. ఈ చిన్న అలవాట్లను జాగ్రత్తగా పాటించడం ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఏవైనా సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.





