వంటింట్లో నిమ్మకాయ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పులిహోర నుండి టీ వరకు.. ప్రతి వంటకానికి ఇది ప్రత్యేక రుచిని ఇస్తుంది. అయితే మనలో చాలా మంది రసం పిండుకున్న తర్వాత నిమ్మ తొక్కలను పనికిరాని వస్తువులా చెత్తబుట్టలో వేస్తారు. కానీ నిమ్మ రసంలో కంటే దాని తొక్కల్లోనే ఎక్కువ పోషకాలు, సహజ నూనెలు ఉంటాయని మీకు తెలుసా? అందం, ఆరోగ్యం, ఇంటి పరిశుభ్రతలో నిమ్మ తొక్కలు మ్యాజిక్‌లా పనిచేస్తాయి. ..
ఫ్రిజ్‌లోని దుర్వాసనలకు చెక్: ఫ్రిజ్‌లో రకరకాల కూరగాయలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలు పెట్టడం వల్ల ఒక్కోసారి వింత వాసన వస్తుంది. ఫ్రిజ్ తెరవగానే వచ్చే ఆ దుర్వాసనను పోగొట్టడానికి నిమ్మ తొక్కలు ఒక గొప్ప సహజ పరిష్కారం. నిమ్మ తొక్కలలో కొంచెం బేకింగ్ సోడా నింపి ఫ్రిజ్ లోని ఒక మూలన ఉంచండి. ఇది దుర్వాసనలను పీల్చుకుని, ఫ్రిజ్‌ను తాజాగా ఉంచుతుంది.
చర్మ సౌందర్యానికి: నిమ్మ తొక్కల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన ఫేస్ ప్యాక్‌ల కంటే ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోండి. ఈ పొడిని రోజ్ వాటర్ లేదా పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే.. ముఖంపై జిడ్డు పోయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
నిమ్మ తొక్కలతో హెల్తీ టీ: మీరు తాగే టీకి కొంచెం వెరైటీ రుచిని, ఆరోగ్యాన్ని జోడించాలనుకుంటే నిమ్మ తొక్కలు బెస్ట్ ఆప్షన్. ఎండబెట్టిన నిమ్మ తొక్కలను టీ చేసేటప్పుడు అందులో వేయండి. ఇది టీకి సహజమైన సువాసనను ఇవ్వడమే కాకుండా శరీరంలోని ఒత్తిడిని తగ్గించి రిఫ్రెష్‌గా ఉంచుతుంది.
రూమ్ ఫ్రెషనర్: షూ రాక్, అల్మారాలు లేదా బ్యాగుల నుండి వచ్చే చెడు వాసనలను పోగొట్టడానికి నిమ్మ తొక్కలను వాడుకోవచ్చు. ఎండిన నిమ్మ తొక్కలను ఒక చిన్న గుడ్డలో కట్టి షూ రాక్‌లో లేదా అల్మారాలో ఉంచండి. ఇది ఒక నేచురల్ రూమ్ ఫ్రెషనర్‌లా పనిచేసి మీ ఇంటిని సువాసనలతో నింపుతుంది.




