ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో పథకం అమలుకు సిద్దమైంది. ఈ మేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. చేనేతలు, మరమగ్గాల కార్మికులకు ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ పథకం ద్వారా చేనేతలు, పవర్ లూమ్స్‌కు ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు. గత ఎన్నికలకు ముందు ఈ మేరకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫోస్టోలో కూడా ఈ విషయాన్ని పొందుపర్చారు. దీంతో అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 1 నుంచి అమలు
ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇప్పటికే అర్హులు ఎంపిక పూర్తయింది. అర్హులకు ఏప్రిల్ 1 నుంచి నిబంధనల ప్రకారం ఉచిత విద్యుత్ కల్పించనున్నారు. రాష్ట్ర బడ్జెట్లో కూడా దీనికి నిధుల కేటాయింపు పూర్తయింది. ఈ పథకం వల్ల లక్షకుపైగా కుటుంబాలు లబ్ది పొందనున్నాయని ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. హ్యాండ్లూమ్స్ కార్మికులకు నెలకు రూ.700 వరకు, పవర్ లూమ్స్ కార్మికులకు రూ.1800 వరకు విద్యుత్ ఖర్చులు ఆదా కానున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో దాదాపు 93 వేల కుటుంబాలు చేనేత పనులు చేసుకుంటూ ఆదాయం పొందుతున్నారు. ఇక 11 వేల వరకు మర మగ్గాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ ఉచిత విద్యుత్ పథకం వల్ల ప్రయోజనం జరగనుందని చెప్పవచ్చు. ఈ నిర్ణయంపై చేనేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేబినెట్ ఆమోదం
చేనేతలకు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి ఇటీవల కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. లబ్దిదారుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తి కావడంతో.. ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. మొత్తం 4 లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ జరగనుంది. ఇక చేనేత కార్మికులకు మరో కార్యక్రమం కూడా ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. త్వరలో వారికి పింఛన్లు కూడా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే త్రిఫ్ట్ ఫండ్లతో చేనేతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. త్రిఫ్ట్ నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆర్ధిక భరోసా కల్పిస్తోంది. అటు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతల కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు ప్రకటించింది. వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది.