ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం, బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ మరోసారి మహాశివరాత్రి మహోత్సవానికి సిద్ధమైంది. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ సమక్షంలో నిర్వహించే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. వేద సంప్రదాయాలు, భజనలు, రాత్రంతా జరిగే ధ్యాన కార్యక్రమాలతో ఈ కేంద్రం ఆధ్యాత్మిక తరంగాలతో పులకించనుంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి ప్రాముఖ్యతను వివరిస్తూ గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కీలక సందేశాన్ని అందించారు. ‘‘శివరాత్రి అనేది భౌతిక ప్రపంచానికి, అంతర్గత అతీంద్రియ ప్రపంచానికి మధ్య ఒక వంతెన. ఇది కేవలం వినోదం కోసమో, బాహ్య శబ్దాల కోసమో జరుపుకునేది కాదు.. మన ఆత్మలో మనం విశ్రాంతి తీసుకునే సమయం. శివరాత్రి అంటే మనలోని లోతైన విశ్రాంతి స్థితికి చేరుకోవడం’’ అని ఆయన తెలిపారు.
మహారుద్ర పూజ.. పర్యావరణ శుద్ధికి మార్గం
ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ మహారుద్ర పూజ. శివుని కరుణా స్వరూపమైన రుద్రుడిని ఆరాధిస్తూ.. వేద పండితుల జపాల మధ్య జరిగే ఈ పూజ ప్రతికూల శక్తిని తొలగించి, ఉన్నత చైతన్యాన్ని మేల్కొల్పుతుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర జపం పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా సమాజంలో శాంతి, శ్రేయస్సును తీసుకువస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు తెలిపారు.
సేవా స్ఫూర్తి
ఈ వేడుక కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కేంద్రంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 2.5 నుండి 3 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కోసం సేవకులు సిద్ధంగా ఉన్నారు. బెంగళూరుతో పాటు దేశంలోని సుమారు 150 ప్రాంతాలలో ఏకకాలంలో రుద్రపూజలు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు ఈ వేడుకలను వీక్షించేలా ప్రత్యక్ష ప్రసార సౌకర్యం కల్పించారు.
ప్రోగ్రామ్ షెడ్యూల్:
- సాయంత్రం 7:15 – 7:45: శ్రావ్యమైన భజనలు
- సాయంత్రం 7:45 – 9:30: పవిత్ర మహారుద్ర పూజ
- రాత్రి 9:30 – 10:30: భజనలు, గురుదేవుల ప్రసంగం
- రాత్రి 11:30: గురుదేవులతో కలిసి ప్రత్యేక అర్ధరాత్రి ధ్యానం
- ఉదయం 4:00 నుండి: మహారుద్ర హోమం
ఆధ్యాత్మికత, సేవా భావం ఉట్టిపడే ఈ మహాశివరాత్రి వేడుకలు భక్తుల హృదయాల్లో శాంతిని నింపనున్నాయి.