Gunaseelam Vishnu Temple: తమిళనాడు రాష్ట్రంలో అనేక మహిమాణ్విత దేవాలయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని తిరుచ్చికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో, కొల్లిడాం నది తీరాన ఉన్న గుణశీల విష్ణు దేవాలయం భక్తుల మనసులలో ప్రగాఢ విశ్వాసాన్ని నింపింది. ఇక్కడ కొలువైన ప్రధాన దైవం మహావిష్ణువు. మానసిక వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు దృఢంగా నమ్ముతారు. ఓం విశ్వరూపాయ నమః అంటూ, మానసిక సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపే ఒక ప్రత్యేక దేవాలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయం యొక్క నిర్మాణం చాలా విశిష్టమైనది. ఆలయ విమానంపై శంకువు ఆకారంలో మూడు ప్రత్యేక నిర్మాణాలు ఉండటం వల్ల దీనిని త్రినేత్ర విమానం అని పిలుస్తారు.
ప్రసన్న వెంకటాచలపతి దేవాలయంగా..
ఈ విమానంపై ఉన్న పెద్ద పెద్ద శిల్పాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా గరుడ వాహనంపై ఉన్న విష్ణు విగ్రహం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ప్రసన్న వదనంతో నిలుచున్న స్థితిలో ఉన్న వెంకటేశ్వరుడి విగ్రహం ఉంది. ఇక్కడ భగవంతుని కుడిచేయి అభయముద్రను చూపుతుండగా, మరో చేతిలో గద ఉంటుంది. మిగిలిన రెండు చేతులలో శంఖు చక్రాలు ఉంటాయి. అందుకే కొందరు ఈ దేవాలయాన్ని ప్రసన్న వెంకటాచలపతి దేవాలయం అని కూడా పిలుస్తారు. గర్భగుడి చుట్టూ నరసింహ, చేతిలో వెన్నముద్దలతో కూడిన కృష్ణుడు, వరాహం, శ్రీదేవి, భూదేవి వంటి అనేక ఇతర విగ్రహాలతో కూడిన ఉపాలయాలు కూడా ఉన్నాయి.
పూజారుల చల్లే నీటి కోసం..
గుణశీల దేవాలయంలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది. రోజుకు ఒకసారి దేవాలయ పూజారులు భక్తుల ముఖంపై నీటిని చిలకరిస్తారు. ఈ నీరు తమపై పడాలని వేలాది సంఖ్యలో భక్తులు ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. ఇందుకోసం వారు కొన్ని గంటల ముందు నుంచే దేవాలయం వద్ద పడిగాపులు కాస్తుంటారు. ఈ ఆచారం మానసిక ప్రశాంతతను చేకూరుస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
మానసిక వ్యాధులు మాయమవుతాయి..
ముఖ్యంగా, మానసిక వ్యాధితో బాధపడేవారికి ఈ దేవాలయం ఒక చక్కని పరిష్కార మార్గాన్ని చూపుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. అటువంటి వారిని కుటుంబ సభ్యులు 48 రోజుల పాటు దేవస్థానంలో వదిలిపెడతారు. ఈ కాలంలో దేవాలయ నిర్వాహకులు వారిని ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తారు. ఇక్కడి దైవం అనుగ్రహం వల్ల 48 రోజుల తర్వాత వారు పూర్తిగా కోలుకుంటారని స్థానికులు, భక్తులు విశ్వసిస్తారు. ఇది కొన్ని సంఘటనల్లో రుజువు కావడం భక్తుల నమ్మకాన్ని మరింత పెంచింది.
15 రోజులపాటు బ్రహ్మోత్సవాలు
ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారు, భగవంతుడి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. గుణశీల దేవాలయం ఆధ్యాత్మిక ప్రశాంతత, మానసిక స్వస్థతకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)