Varun Chakaravarthy : ఇది 4 ఏళ్ల నిరీక్షణ.. వరుణ్ చక్రవర్తి వర్సెస్ పాకిస్థాన్.. పగ తీర్చుకునే సమయం ఆసన్నమైందా?

Varun Chakaravarthy : ఇది 4 ఏళ్ల నిరీక్షణ.. వరుణ్ చక్రవర్తి వర్సెస్ పాకిస్థాన్.. పగ తీర్చుకునే సమయం ఆసన్నమైందా?


Varun Chakaravarthy : భారత జట్టు టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాల లక్ష్యంతో శ్రీలంకలో అడుగుపెట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో అందరి కళ్లు వరుణ్ చక్రవర్తిపైనే ఉన్నాయి. ప్రస్తుతం ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్-1 స్థానంలో ఉన్న వరుణ్, గత ఏడాది ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించి ఈ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే, 2021లో పాక్‌తో జరిగిన ఒక చేదు జ్ఞాపకం అతడిని ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

2021 టీ20 ప్రపంచకప్‌లో వరుణ్ చక్రవర్తి తన అరంగేట్రం మ్యాచ్‌ను పాకిస్థాన్‌పైనే ఆడాడు. అప్పట్లో అతడు కేవలం 3 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవంతో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోవడమే కాకుండా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ సమయంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అతడి స్థానం 151. ఆ టోర్నీ తర్వాత అతడి కెరీర్ దాదాపు ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. వరుసగా మూడు ఏళ్లు జట్టుకు దూరమై, ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, పట్టుదల వీడకుండా ఐపీఎల్‌లో అదరగొట్టి, 2024లో మళ్లీ టీమ్ ఇండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు.

2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత నుంచి వరుణ్ చక్రవర్తి బ్రేకుల్లేకుండా దూసుకుపోతున్నాడు. గడిచిన ఏడాది కాలంలో అంతర్జాతీయ టీ20ల్లో ఏకంగా 61 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ 61 వికెట్లలో 48 వికెట్లు కేవలం తన గుగ్లీ బంతులతోనే సాధించాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో (7 నుంచి 16 ఓవర్ల మధ్య) వరుణ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం పాక్ బ్యాటర్లకు హిమాలయాలను ఎక్కడం లాంటిదే. ప్రస్తుతం అతడి ఎకానమీ 7.30 మాత్రమే ఉండటం, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే అతడి మిస్టరీ బౌలింగ్ ఈసారి పాక్‌కు పెను ముప్పుగా మారనుంది.

గతంలో తన కెరీర్‌ను ప్రమాదంలో పడేసిన పాకిస్థాన్ జట్టుపై ఈసారి అదే స్థాయిలో విరుచుకుపడాలని వరుణ్ సిద్ధమయ్యాడు. ఆసియా కప్‌లో ఇప్పటికే పాకిస్థాన్‌ను ఓడించి తన సత్తా చాటిన వరుణ్, ఇప్పుడు వరల్డ్ కప్ వేదికగా దాయాది జట్టును మట్టికరిపించాలని చూస్తున్నాడు. కొలంబోలోని ప్రేమదాస పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం కావడంతో, వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ బంతులకు పాక్ ఆటగాళ్లు వికెట్లు పారేసుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *