Indias Gold Hoard: భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు, ఇది సంస్కృతి, సంప్రదాయం, ఆస్తి, ఆర్థిక భద్రతతో ముడిపడిన ఒక లోతైన సెంటిమెంట్. తరతరాలుగా భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే ఒక విలువైన ఆస్తిగా భావిస్తూ వచ్చారు. నిపుణులు అంచనా ప్రకారం, భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 30 వేల టన్నుల బంగారం నిల్వ ఉంది. ప్రస్తుత అంతర్జాతీయ బంగారం ధరల ప్రకారం.. ఈ పసిడి విలువ సుమారు 5 ట్రిలియన్ డాలర్లుగా గుర్తించారు. ఇది భారతీయ కరెన్సీలో సుమారు 452 లక్షల కోట్లకు సమానం అని నిపుణుల నివేదికలు చెబుతున్నాయి.
ఈ భారీ సంపద భారతదేశం ఒక సంవత్సరంలో ఆర్జించే మొత్తం ఆదాయాన్ని సైతం మించిపోవడం విశేషం. ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ అక్టోబర్ 2025 నివేదిక ప్రకారం, 2025-26 సంవత్సరానికి భారతదేశ నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.125 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. జీడీపీ అనేది ఒక సంవత్సరంలో దేశం ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల మొత్తం విలువను సూచిస్తుంది. కానీ భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం అనేది తరతరాలుగా కూడబెట్టిన సంపద. బంగారం ధరలు పెరిగితే దీని విలువ పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది.
వాస్తవానికి, దేశంలో బంగారం నిల్వలు ఎక్కువ అయినప్పటికీ, భారతీయ కుటుంబాల చేతుల్లో ఉన్నంత పెద్ద మొత్తంలో బంగారం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఇటీవలి ఏళ్లలో బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఈ సంపద విలువ మరింత పెరిగింది. 2025 ఏడాదిలోనే బంగారం ధరలు దాదాపు 65 శాతానికి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. డాలర్ మరియు ప్రభుత్వ బాండ్లపై నమ్మకం తగ్గిపోవడం, ప్రధాన దేశాల్లో ఆర్థిక ఒత్తిళ్లు, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అనేక అంతర్జాతీయ కారణాలు ఈ పెరుగుదలకు దారితీశాయి. పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు సైతం బంగారాన్ని మళ్లీ ఒక సురక్షితమైన ఆర్థిక పెట్టుబడిగా పరిగణిస్తుండటంతో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా బంగారం విలువ నిరంతరం పెరుగుతోంది.
భారతీయ ఇళ్లల్లో బంగారం కీలక పాత్ర:
భారతీయ ఇళ్లలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా, సామాజిక భద్రతా భావాన్ని కూడా కల్పిస్తుంది. పెళ్లిళ్లు, పండగలు వంటి శుభకార్యాలలో దీనికి ప్రాధాన్యత ఉంది. అలాగే, కష్టకాలంలో ఆర్థిక సహాయంగా నిలుస్తుందనే నమ్మకం బలంగా పాతుకుపోయింది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో నిల్వ ఉన్న బంగారం నేరుగా ఆదాయాన్ని ఆర్జించదు. ఇది వ్యాపారాలు లేదా ఉద్యోగాల వలె ఆర్థిక వృద్ధిని నడిపించదు. దేశాభివృద్ధికి ప్రత్యక్షంగా తోడ్పడదని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సంపదగానే చూడాలని వారు సూచిస్తున్నారు.
అయితే ప్రస్తుత రోజుల్లో బంగారం పట్ల భారతీయుల అభిప్రాయం నెమ్మదిగా మారుతోంది. చాలా మంది భారతీయులు తమ వద్ద ఉన్న బంగారాన్ని గోల్డ్ లోన్లు, గోల్డ్ బాండ్ల వంటి వివిధ ఆర్థిక మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణి వల్ల ఇళ్లలో నిల్వ ఉన్న బంగారం క్రమంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరుతోంది. గృహాల్లో దాచిన బంగారాన్ని బ్యాంకింగ్, పెట్టుబడి మార్గాల్లోకి తీసుకురావడం జరిగితే, అది దేశ ఆర్థిక వ్యవస్థకు, స్థూల వృద్ధికి గణనీయంగా సాయపడుతుందని తెలుస్తోంది. ఈ మార్పు భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి