కన్నూమిన్నూ కానడం లేదు.. పరువు తీస్తున్నారు.. అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు ఏమన్నారో తెలుసా..?

కన్నూమిన్నూ కానడం లేదు.. పరువు తీస్తున్నారు.. అరవ శ్రీధర్ తీరుపై జనసేన ఎమ్మెల్యేలు ఏమన్నారో తెలుసా..?


లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన అసెంబ్లీ సమావేశాలకు అరవ శ్రీధర్ రాకపోవడంపై జనసేన ఎమ్మెల్యేలు చిట్‌చాట్‌లో అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి రావొద్దని పార్టీ పరంగా తాము ఎక్కడా చెప్పలేదని, పార్టీ వ్యవహారాలకు మాత్రమే దూరంగా ఉండాలని సూచించామన్నారు. అసెంబ్లీకి వచ్చేందుకు అరవ శ్రీధర్‌కు మొహం చెల్లడం లేదేమోనన్నారు. తాము పార్టీ కోసం కష్టపడి పని చేశామని, కేసులు భరించామని, జైళ్లకు కూడా వెళ్లి వచ్చామని, ఇప్పుడు ఎమ్మెల్యేలమయ్యామని, కొందరు మాత్రం దారి తప్పి పవన్ కల్యాణ్ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. చిన్నస్థాయి వ్యక్తుల్ని ఎమ్మెల్యే చేస్తే తలదించుకునే పనులు చేసి పార్టీ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారిగా అధికారం చూసేసరికే కొందరికి కన్నూమిన్నూ తెలియడంలేదని జనసేన ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియోలు బయటకు రావడం.. ఆయనపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి.. తనను ఎమ్మెల్యే మోసం చేశాడని ఆరోపించింది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చడానికి జనసేన పార్టీ కమిటీని ఏర్పాటుచేసింది. ఆరోపణలపై పార్టీ కమిటీకి అరవ శ్రీధర్ వివరణ ఇచ్చుకున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్‌తో పాటు రైల్వే కోడూరూలో దాదాపు 50 మందిని విచారించినట్లు సమాచారం. అంతేకాదు, బాధితురాలిని విచారణకు రావాలని కోరామని, కానీ ఆమె రాలేదన్నారు ఎమ్మెల్యేలు. షీల్డ్ కవర్‌లో ఆమె వివరాలు పంపిందని, వాటిని పరిశీలిస్తామని తెలిపారు.

అలాగే, ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని, శ్రీధర్, బాధితురాలికి సంబంధించిన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. దీనిని జనసేనపై రుద్ది ప్రయత్నం చేయొద్దన్నారు. త్వరలోనే విచారణను పూర్తిచేసి కమిటీ నివేదికను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు అందజేస్తామన్నారు జనసేన ఎమ్మెల్యేలు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *