IND vs PAK : పాక్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు డేంజర్ సిగ్నల్..ఆ బౌలర్‌తో టీమిండియాకు భారీ ముప్పు

IND vs PAK : పాక్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు డేంజర్ సిగ్నల్..ఆ బౌలర్‌తో టీమిండియాకు భారీ ముప్పు


IND vs PAK : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నా, ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ పోరుకు ముందు ఒక ప్రమాద ఘంటిక మోగింది. నమీబియాపై 93 పరుగుల భారీ విజయం సాధించినప్పటికీ, ఆ మ్యాచ్‌లో ఒక సాధారణ స్పిన్నర్ భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ వేసిన బంతులకు మన స్టార్ ప్లేయర్లు విలవిలలాడటం చూస్తుంటే, పాక్ జట్టులో ఉన్న ఒక మిస్టరీ బౌలర్ భారత్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీ వేదికగా జరిగిన నమీబియా మ్యాచ్‌లో భారత్ 209 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ వేసిన 4 ఓవర్లలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఎరాస్మస్ కేవలం 20 పరుగులు ఇచ్చి ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎరాస్మస్ బౌలింగ్ యాక్షన్. అతను సంప్రదాయ స్పిన్నర్ లాగా కాకుండా, సైడ్ ఆర్మ్ లేదా స్లింగ్ స్టైల్‌లో బంతులు విసిరాడు. ఈ యాక్షన్ వల్ల బంతి ఎక్కడ పడి ఎటు తిరుగుతుందో అంచనా వేయడం భారత బ్యాటర్లకు కష్టమైంది.

నమీబియా కెప్టెన్ యాక్షన్ తో భారత బ్యాటర్లు ఇబ్బంది పడటం చూసిన పాకిస్థాన్, ఇప్పుడు కొలంబోలో జరగబోయే మ్యాచ్‌లో తమ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ను రంగంలోకి దించే ప్లాన్ చేస్తోంది. ఉస్మాన్ తారిక్ యాక్షన్ కూడా ఎరాస్మస్ లాగే సైడ్ ఆర్మ్ లో ఉంటుంది. కానీ ఇతను ఇంకా ప్రమాదకరం. బంతిని రిలీజ్ చేసే ముందు ఒక సెకను పాటు గాల్లోనే ఆగిపోయి బ్యాటర్‌ను గందరగోళానికి గురిచేస్తాడు. ఈ అసాధారణ యాక్షన్ వల్ల బంతి స్పిన్ అవుతుందా లేదా నేరుగా వేగంగా వస్తుందో కనిపెట్టడం చాలా కష్టం.

ఉస్మాన్ తారిక్ ట్రాక్ రికార్డ్ చూస్తే టీమిండియా ఎందుకు జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. ఇప్పటివరకు ఆడిన కేవలం 4 అంతర్జాతీయ టీ20ల్లోనే 11 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్ టీ20 కెరీర్‌లో 42 మ్యాచ్‌ల్లోనే 70 వికెట్లు తీసి ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారాడు. కొలంబోలోని ఆర్ ప్రేమిదాస స్టేడియం పిచ్‌లు స్పిన్‌కు బాగా అనుకూలిస్తాయి కాబట్టి, ఉస్మాన్ తారిక్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం సూర్యకుమార్ యాదవ్ సేనకు పెద్ద సవాలే.

పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే మానసిక యుద్ధం. ఇలాంటి సమయంలో ఉస్మాన్ తారిక్ లాంటి కొత్త బౌలర్లు భారత బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం ఉంది. నమీబియా మ్యాచ్‌లో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని, నెట్ ప్రాక్టీస్‌లో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ ద్వారా బ్యాటర్లు సన్నద్ధం కావాలి. లేదంటే ఆ 4 ఓవర్లు భారత ఇన్నింగ్స్‌ను తలకిందులు చేసే ప్రమాదం ఉంది. మరి ఈ మిస్టరీని టీమిండియా ఎలా ఛేదిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *