జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా, నటుడిగా, ఐటీ ఉద్యోగిగా అనిల్ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అనుభవాలను అతడు పంచుకున్నాడు. అనిల్ మొదట ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ స్నేహితుడిగా నటిస్తున్నప్పుడు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి టీమ్ తన కోసం ఒక నెల నుంచి ఎదురుచూస్తోందని తెలిసిందన్నాడు. ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో, మొదట రామ్ చరణ్‌కు డూప్‌గా కొన్ని షాట్లలో, ముఖ్యంగా కొమురం భీముడో పాటలో ఇంటర్వెల్ ఫైట్‌లో బ్యాక్ షాట్లకు పనిచేశానన్నాడు. రామ్ చరణ్ సెట్స్‌లో చాలా ఫ్రెండ్లీగా, వినయంగా అందరితో మాట్లాడతారని అనిల్ తెలిపారు. రాజమౌళి సినిమా పర్ఫెక్షన్ కోసం ఎన్ని టేక్స్ అయినా వెనకాడరని, ఆయన దృష్టిలో స్క్రీన్ మీద రావాల్సిన షాట్ మాత్రమే ముఖ్యమని అనిల్ వివరించారు.
ఎన్టీఆర్‌తో అనిల్‌కు మంచి అనుబంధం ఉంది. జెప్టో యాడ్ షూటింగ్లో వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్ సీన్లను అనిలే తారక్‌కు వివరించారు. ఇటీవల మలబార్ యాడ్‌లో కూడా వివాహ సన్నివేశాల్లో కెమెరా, లైటింగ్ సెటప్ కోసం ముందుగా అనిల్‌నే ఉపయోగిస్తారు. తర్వాత ఆయనే తారక్‌కు సీన్‌ను వివరిస్తారు. అనిల్ కేవలం స్టంట్మ్యాన్గానే కాకుండా నటుడిగా జార్జ్ రెడ్డి వంటి చిత్రాలలో నటించారు. సమోసా తింటావా శిరీషా డైలాగ్‌తో పాపులర్ అయిన తిరువీర్ స్నేహితుడిగా, థియేటర్ ఆర్టిస్టుగా తన ప్రయాణం మొదలైంది. తాను థియేటర్ ఆర్టిస్ట్‌గా కమిట్మెంట్ కారణంగా జార్జ్ రెడ్డిలో విలన్ పక్కన స్నేహితుడి పాత్రను మొదట తిరస్కరించానని, తర్వాత తిరువీర్ కోరిక మేరకు మరో పాత్ర చేశానని వివరించారు. తాను అమెజాన్ లాంటి సంస్థలలో కూడా పని చేస్తున్నానని, సినిమా రంగం స్థిరత్వం లేనిదని, కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి విద్యకు ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు.
బాలీవుడ్ చిత్రం వార్ 2 నుండి ఆఫర్ వచ్చినా, తక్కువ పారితోషికం, ఇతర ఖర్చులు భరించాల్సి ఉండటంతో ఆ అవకాశాన్ని తిరస్కరించారు. బాలీవుడ్ ప్రస్తుతం పూర్తిగా కమర్షియల్‌గా మారిందని, టాలీవుడ్ మాత్రం కథాబలం ఉన్న చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని అనిల్ అభిప్రాయపడ్డారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలతో టాలీవుడ్ గ్రాఫ్ హాలీవుడ్ స్థాయికి చేరిందని, విదేశీ సాంకేతిక నిపుణులు కూడా మన చిత్రాలకు పని చేస్తున్నారని ఆయన గర్వంగా చెప్పారు.