Tollywood: ఆ రోజుల్లో శోభన్ బాబు అలా అనేసరికి.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ నటి

Tollywood: ఆ రోజుల్లో శోభన్ బాబు అలా అనేసరికి.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ నటి


టాలీవుడ్ సీనియర్ నటి వై. విజయ తన సినీ ప్రస్థానంలోని స్టార్టింగ్ డేస్‌ను, ప్రముఖ నటుడు శోభన్ బాబుతో తనకున్న జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. డ్యాన్స్‌పై ఉన్న తనకున్న మక్కువతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వై. విజయ.. తన తొలి చిత్రం కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘నిండు హృదయాలు’ అని తెలిపారు. అందులో ఒక పేద అమ్మాయి పాటలో నటించానని, డ్యాన్స్‌పై పట్టు ఉండడం వల్ల ఆ సీన్స్ సులభంగా చేయగలిగానని చెప్పారు. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో రామ విజేత ఫిలిమ్స్ నిర్మించిన “తల్లిదండ్రులు” చిత్రంలో నటిగా అవకాశం వచ్చిందని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఆ చిత్రానికి హీరోయిన్‌గా ఎంపికవ్వడం చాలా విచిత్రంగా జరిగిందన్నారు. రామ విజేత ఫిలిమ్స్ 18 ఏళ్ల అమ్మాయి కావాలంటూ పేపర్లలో ప్రకటన ఇవ్వగా.. మాస్టర్ ఎం.ఎస్. వై. విజయ పేరును సూచించారు. దాదాపు 2000 ఫోటోలలో నుంచి వై. విజయ ఫోటోను ఎంపిక చేశారు. అయితే సినిమా అంటే తనకు ప్రత్యేకమైన ఆసక్తేమీ ఉండేది కాదని, కేవలం డ్యాన్స్ నేర్చుకోవడమే తన ఉద్దేశ్యమని ఆమె స్పష్టం చేశారు. తను సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయడంపై తనకు పెద్దగా సంతోషం లేదని, ఎలాంటి కోరికలు లేవని చెప్పారు. అప్పట్లో ఆడపిల్లలకు ఏదో ఒకటి ఉండాలి కదా, ఫేమస్ అవ్వాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి పెళ్లి చేసుకోవాలి అని అంటారని, కానీ తన మైండ్‌లో అలాంటివి ఏమీ లేవని విజయ అన్నారు.

తన సినీ ప్రస్థానానికి తల్లిదండ్రులు, తోబుట్టువులు అందించిన సహకారం ఎంతో ఉందని విజయ వివరించారు. ఆమె తల్లి షూటింగ్‌లలో తనతోపాటే ఉండేవారని ఆమె తెలిపారు. తన తండ్రి “సినిమాలు చేస్తే చెయ్యని, కానీ ఏ రోజు నా కూతురి కంటి నుంచి ఒక నీటి చుక్క కూడా బయటికి రాకూడదు, ఏమైనా జరిగితే దానికి బాధ్యురాలు నువ్వే” అని తన తల్లికి చెప్పేవారని విజయ పంచుకున్నారు. సినీ రంగంలో ఆడపిల్లలకు ఎదురయ్యే సవాళ్ల గురించి మాట్లాడుతూ, “మన క్యారెక్టర్‌ని బట్టి ఉంటుంది ప్రతీది. మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేశామంటే అక్కడ ఎదుటి వాళ్లకు ఆ ఛాన్సే లేదు” అని చెప్పారు. తన తల్లిని చూస్తే ఎవరూ తనను అప్రోచ్ అవ్వడానికి ధైర్యం చేసేవారు కాదని, తన తల్లి మాటలు అందరితో జాలిగా ఉన్నా, తాను మాత్రం సీరియస్‌గా తలదించుకుని ఉండేదాన్ని అని తెలిపారు.

శోభన్ బాబుతో జరిగిన ఓ సరదా సంఘటనను వై. విజయ గుర్తుచేసుకున్నారు. శోభన్ బాబు తనను చూసి “ఏం చదివావ్, ఏ ఊరి నుంచి వచ్చావ్, నీ వయసెంత?” అని అడిగారని, “నా వయసులో నీకు సగం వయసు ఉందా?” అని అడగగా, అప్పుడు తాను 13 ఏళ్లని చెప్పానని వివరించారు. దానికి శోభన్ బాబు ఆశ్చర్యపోయి, “13 ఏళ్లా, ఇంత ఎత్తు ఉన్నావ్, ఏం చదివావ్, టెన్త్ వరకు చదివాను సార్, నైన్త్ ఫుల్ ఫినిష్ చేశాను. 18 ఏళ్లు లేవంటున్నావు. 13 ఏళ్లు.! ఏ ఊరు.. కడప సార్, మరి ఇంత తెల్లగా ఎలా ఉన్నావ్” అని అడిగారని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో సిగ్గు పడే తన స్వభావం వల్ల శోభన్ బాబు ఉద్దేశాన్ని తాను సరిగా అర్థం చేసుకోలేదని విజయ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *