తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం అదిరిపోయే పథకానికి శ్రీకారం చుట్టనుంది. వీరి కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో 15 రోజుల్లో ఈ స్కీమ్‌ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. తాజాగా సెక్రటేరియట్లో సీఎస్ రామకృష్ణారావు అధ్వర్యంలో ఉద్యోగుల హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్య పథకం అమలు, విధివిధానాలపై చర్చించారు. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయించారు.
కీలక నిర్ణయాలు ఇవే..
-ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం హెల్త్ స్కీమ్‌కు వెళ్లనుండగా.. ప్రభుత్వం కూడా అదే మొత్తంలో జమ చేస్తుంది
-ప్రతీ ఏడాది ఉద్యోగులు, ప్రభుత్వం రూ.523 కోట్ల చొప్పున ఈ పథకానికి చెల్లిస్తుంది
-హెల్త్ కేర్ ట్రస్టులో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ఉంటారు
-ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ట్రస్ట్ సీఈవోగా నియమిస్తారు
-పక్క రాష్ట్రాల్లో ట్రీట్మెంట్కు కూడా ఈ పథకం వర్తించేలా చేయనున్నారు
-ఇక 515 ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం ఉంటుంది
-మెడల్ స్కూల్స్, గురుకురాల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులుగా చేర్చనున్నారు. ట్రస్ట్ ఏర్పడ్డాక ఈ మేరకు తీర్మానం చేయనున్నారు
-భవిష్యత్తులో అవసరం మేరకు పథకంలో మార్పులు, చేర్పులు చేస్తారు
ఈ నెలలోనే పథకం ప్రారంభం
ఈ నెలలోనే ఉద్యోగులు, పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగులకు ఈ పథకం వర్తింపచేయనున్నారు. రాష్ట్రంలో లక్షా 44 వేల మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి డిపెండెంట్లు 12.84లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ ఈ పథకంతో ప్రయోజనం కలగనుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల రేవంత్ శుభవార్త అందించారు. ప్రతీ నెలా ఒకటో తేదీన బ్యాంక్ అకౌంట్లలో జీతం జమ చేస్తున్నట్లు చెప్పారు. ఇక డీఏ, ఇతర అలవెన్స్‌లు కూడా విడుదల చేశారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే జీతం జమ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు థర్డ్ పార్టీ ఏజెన్సీలు జీతం జమ చేస్తున్నాయి. కానీ ఆ ఏజెన్సీలు ఉద్యోగులకు సకాలంలో జీతం జమ చేయడం లేదు. దీంతో ప్రభుత్వమే వారికి శాలరీ జమ చేయాలని నిర్ణయించింది