ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం మరింత ఆలస్యం కాబోతోందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అవుననిపిస్తుంది. వీలైనంత త్వరగా ప్రయోగాన్ని చేపట్టి సక్సెస్ కొట్టాలనుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు ఏదో ఒక అవరోధం ఎదురవుతూనే ఉంది. అవి కూడా ఊహించని అవరోధాలు.. కలలో కూడా.. శత్రు దేశాలు కూడా ఊహించని వైఫల్యాలు ఇటు ఇస్రోని కూడా షాక్ గురి చేసిన ఉదాహరణలు ఇటీవల వరుసగా జరిగాయి. అవే PSLV రాకెట్ ప్రయోగం ఫలితాలు.. అదే ఇప్పుడు ఇస్రో ప్రెస్టీజియస్ ప్రాజెక్టు అయిన గగన్‌యాన్ మరింత ఆలస్యం అవుతోంది..!!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ప్రయోగాల్లో గగన్ యాన్ ప్రాజెక్ట్ ఒకటి. ముందుగా 2027 లో గగన్ యాన్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు మొదలు పెట్టింది. భారత్ చేపట్టనున్న తొలి మానవ సహిత ప్రయోగం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇస్రో ఎక్కడా రిస్క్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు అనేక దశల్లో ప్రయోగాత్మక ప్రయోగాలను చేపడుతోంది.. ఈ టెస్ట్ లాంచ్ ల ద్వారా వ్యోమగాములు క్షేమంగా తిరిగి రావడానికి ఎలాంటి సమస్యలు రాకుండా.. అలాగే అంతరిక్షంలో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా లేకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసేలా ఈ ప్రయోగాలు దోహదం చేస్తాయి. అసలు ప్రయోగం కంటే ముందు ఇలాంటి టెస్ట్ లాంచ్ లు 50 కి పైగా చేపట్టాల్సి ఉంటాయని ఇస్రో ముందే తెలిపింది.
అయితే ఇప్పటికే పలు కీలక టెస్ట్ లాంచ్ లను ఇస్రో ఇప్పటికే పూర్తి చేసింది. కానీ ఇంకా కీలక దశలకు స్పందించిన ప్రయోగాలు ఫిబ్రవరి నుంచి పదికి పైగా ప్రయోగాత్మక ప్రయోగాలు చేపట్టాల్సి ఉందని ఇస్రో వర్గాలు అంటున్నాయి. కానీ అందుకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్లానింగ్ ప్రకారం ఇస్రో చేపట్టాల్సిన ప్రయోగాలు వైఫల్యం కావడమే.. ఇస్రో జర్నీలో కీలకమైన అత్యంత నమ్మకమైన రాకెట్ గా పేరొందిన PSLV రాకెట్స్ వరుస అపజయాలు.. అవును PSLV ప్రయోగం చేపడుతుంది అంటే మనకంటే ఎక్కువగా పొరుగు దేశాలే వాటి విజయాన్ని నమ్ముతుంటాయి. అంతగా ఇస్రోకి కలిసొచ్చిన PSLV రాకెట్ విఫలం కావడం ఆర్థికంగా జరిగిన నష్టం కంటే సమయం వృథా అవడమే ఇపుడు ఇబ్బందిగా మారింది.
ఇటీవల ఇస్రో చేపట్టి విఫలమైన PSLV C 62 ద్వారా అంతరిక్షంలోకి పంపిన ఇతర దేశాలకు చెందిన 15 ఉపగ్రహాలు వృధా అయ్యాయి. అంటే కమర్షియల్ గా భారత్ పై పెట్టుకున్న నమ్మకాలపై ప్రభావం పడింది. PSLV-C62 ప్రయోగ వైఫల్యం కావడంతో ఫిబ్రవరి నెలలో జరగాల్సిన గగన్ యాన్ మరో టెస్ట్ లాంచ్ ఆలస్యం అవుతోంది. ఇక కమర్షియల్ గా భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల్లో భాగంగా సమయానికి చేపట్టాల్సిన ప్రయోగాలకు ప్రాధాన్యతనివాల్సి ఉంది. దీంతో గగన్ యాన్ ప్రాజెక్టు అనుకున్న సమయానికి జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు పెద్ద అనుమానంగా మారింది.
గగన్‌యాన్ ప్రయోగం భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం. ఇందులో ముగ్గురు వ్యోమగాములను కూడా భూమి దిగువ కక్ష్యకు (low ఎర్త్ ఆర్బిట్) తీసుకువెళుతుంది. వ్యోమగాముల సిబ్బందితో కూడిన ఈ మిషన్ అంతరిక్షంలో దాదాపు మూడు రోజులు ఉంటుంది. గగన్‌యాన్ G1 అని పిలువబడే సిబ్బంది లేని ఫ్లైట్ ఇది మొదట అన్ని వ్యవస్థలను పరీక్షిస్తుంది. ఇందులో ప్రయోగాత్మకంగా ప్రయాణీకుడిగా వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోట్ కూడా ఇందులో అమర్చి పెట్టనున్నారు. సమయానికి గగన్‌యాన్ పూర్తి కావాలంటే ముందుగా చేపట్టాల్సిన టెస్ట్ లాంచ్ లు పూర్తి కావాల్సి ఉంది. ఇవన్నీ దాటుకుని ఇస్రో అనుకున్న సమయానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గగన్‌యాన్ పూర్తి చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది..!
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..