IND vs NAM : టీ20 వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జైత్రయాత్రను కొనసాగించేందుకు సిద్ధమైంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పసికూన నమీబియాతో టీమిండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై చెమటోడ్చి గెలిచిన భారత్, ఇప్పుడు నమీబియాను చిత్తు చేసి సెమీస్ దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లపై అందరి దృష్టి నెలకొంది. మ్యాచ్‌లో ప్రభావితం చేయగల టాప్-5 ప్లేయర్ల గురించి తెలుసుకుందాం.
1. సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ – భారత్)
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. అమెరికాతో జరిగిన గత మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ, ఒంటరి పోరాటం చేసి 49 బంతుల్లో 84 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. 360 డిగ్రీల బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టే సూర్య, ఢిల్లీలోని చిన్న స్టేడియంలో మరిన్ని సిక్సర్లతో చెలరేగే అవకాశం ఉంది. నమీబియా బౌలర్లకు అతనే అతిపెద్ద సవాలు.
2. ఇషాన్ కిషన్ (ఓపెనర్ – భారత్)
లెఫ్ట్ హ్యాండ్ విమానంలా దూసుకుపోయే ఇషాన్ కిషన్, ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. రీసెంట్‌గా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సెంచరీ బాదిన ఇషాన్, వార్మప్ మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికాపై 20 బంతుల్లోనే 53 పరుగులు చేసి సత్తా చాటాడు. అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానుండటంతో, ఓపెనింగ్‌లో టీమిండియాకు భారీ స్కోరు అందించే బాధ్యత ఇషాన్ కిషన్ భుజస్కంధాలపై ఉంది.
3. జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ (నమీబియా)
నమీబియా జట్టులో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ లోఫ్టీ-ఈటన్. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీ (33 బంతుల్లో) చేసిన రికార్డు ఇతని సొంతం. నెదర్లాండ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ 42 పరుగులతో రాణించి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. భారత్ వంటి పటిష్టమైన జట్టుపై నమీబియా అద్భుతం చేయాలంటే, ఈ హిట్టర్ ఖచ్చితంగా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.
4. రూబెన్ ట్రంపెల్‌మాన్ (బౌలర్ – నమీబియా)
నమీబియా పేస్ గుర్రం ట్రంపెల్‌మాన్. లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావడంతో ఇతను కొత్త బంతితో భారత ఓపెనర్లను ఇబ్బంది పెట్టగలడు. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో ఇతను దిట్ట. గత టీ20 వరల్డ్ కప్‌లలో కూడా తొలి ఓవర్లోనే వికెట్లు తీసి ప్రత్యర్థులను షాక్‌కు గురిచేసిన చరిత్ర ఇతనికుంది. ఢిల్లీ పిచ్‌పై ఇతని వేగం భారత బ్యాటర్లకు పరీక్షగా మారవచ్చు.
5. హార్దిక్ పాండ్యా (ఆల్ రౌండర్ – భారత్)
భారత జట్టు సమతుల్యతకు హార్దిక్ పాండ్యా అత్యంత కీలకం. బ్యాటింగ్‌లో ఫినిషర్ పాత్రను పోషిస్తూనే, బౌలింగ్‌లో కీలక వికెట్లు తీయగల సామర్థ్యం ఇతని సొంతం. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో నమీబియా బ్యాటర్ల జోరును అడ్డుకోవడంలో పాండ్యా పాత్ర కీలకం కానుంది. ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించే హార్దిక్, తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..