Harbhajan Singh : హర్భజన్ సింగ్ సెటైర్లు మామూలుగా లేవుగా.. పాకిస్థాన్‎కి మాడు పగిలే కౌంటర్

Harbhajan Singh : హర్భజన్ సింగ్ సెటైర్లు మామూలుగా లేవుగా.. పాకిస్థాన్‎కి మాడు పగిలే కౌంటర్


Harbhajan Singh : టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న హైడ్రామా ముగిసింది. మొదట ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని భీష్మించుకు కూర్చున్న పాకిస్థాన్, చివరి నిమిషంలో యూ-టర్న్ తీసుకుంది. ఈ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సౌరవ్ గంగూలీ, మదన్ లాల్ వంటి ప్రముఖులు తమదైన శైలిలో స్పందించారు. పాక్ వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం డబ్బు, ఐసీసీ జరిమానాల భయమేనని వారు విశ్లేషిస్తున్నారు.

డబ్బు కోసమే పాక్ దిగివచ్చింది: హర్భజన్ సింగ్

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్థాన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఎద్దేవా చేశారు. “భారత్ లేకపోయినా ఈ టోర్నీ సాగుతుంది కానీ, భారత్ లేకపోతే ఏదీ జరగదు అన్న నిజాన్ని పాకిస్థాన్ ఆలస్యంగా గుర్తించింది. బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తున్నామని, భారత్‌తో ఆడబోమని గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈ మ్యాచ్ ఆడకపోతే వచ్చే ఆర్థిక నష్టం, ఐసీసీ విధించే జరిమానాలు, భవిష్యత్తులో టోర్నీల ఆతిథ్య హక్కులు కోల్పోతామనే భయం వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అందుకే ఇప్పుడు గత్యంతరం లేక దారిలోకి వచ్చారు” అని భజ్జీ ఎఎన్ఐతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

క్రీడలు వేరు, రాజకీయం వేరు: సౌరవ్ గంగూలీ

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. క్రీడలను, రాజకీయాన్ని విడివిడిగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. “భారత్-పాక్ మ్యాచ్‌లు ఎప్పుడూ ఉత్సాహాన్నిస్తాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ నుంచి సరైన పోటీ లేకపోయినా, ఈ మ్యాచ్ జరగడం మంచి పరిణామం. టీమిండియా ప్రస్తుతం చాలా బలంగా ఉంది, వారిని ఓడించడం పాకిస్థాన్‌కు అంత సులభం కాదు” అని గంగూలీ వ్యాఖ్యానించారు.

డ్రామా ఆడుతున్నారు: అతుల్ వాసన్

మరో మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ పాక్ తీరును డ్రామాగా అభివర్ణించారు. “ఒకసారి ఆడమంటారు, మరోసారి కోపం అంటారు. ఇలాంటి వింత చేష్టల వల్ల పాక్ ఆటగాళ్ల మనోధైర్యం దెబ్బతింటుంది. ఐసీసీ మీద కోపం ఉంటే టోర్నీ మొత్తాన్నే బహిష్కరించాలి కానీ, కేవలం భారత్ మ్యాచ్‌ను ఇష్యూ చేయడం ఏంటి?” అని ఆయన ప్రశ్నించారు. అలాగే, 1983 వరల్డ్ కప్ హీరో మదన్ లాల్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ జరగకపోతే టోర్నీ కళ తప్పుతుందని, శ్రీలంక, బంగ్లాదేశ్ ఒత్తిడి వల్ల పాక్ వెనక్కి తగ్గడం శుభపరిణామమని అన్నారు.

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ స్క్వాడ్ నుంచి తొలగించగా, భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరింది. ఐసీసీ దీనిని తిరస్కరించడంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చారు. దీనికి నిరసనగా పాకిస్థాన్ మొదట భారత్ మ్యాచ్‌ను బహిష్కరించాలని చూసింది. అయితే, శ్రీలంక అధ్యక్షుడు, ఐసీసీ అధికారులతో చర్చల అనంతరం, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన జట్టును ఫిబ్రవరి 15న కొలంబోలో ఆడాలని ఆదేశించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *