Stingless Bees: ఈ తేనెటీగలు కుట్టినా ఏం కాదు.. మస్త్ డబ్బులు వస్తాయ్..

Stingless Bees: ఈ తేనెటీగలు కుట్టినా ఏం కాదు.. మస్త్ డబ్బులు వస్తాయ్..


Stingless Bees: ఈ తేనెటీగలు కుట్టినా ఏం కాదు.. మస్త్ డబ్బులు వస్తాయ్..

తేనెటీగలు అంటేనే చాలా మందికి భయం. ఇక వాటిని పెంచాలంటే సాహసం చేయాల్సిందే అనిపిస్తుంది. కానీ తేనె ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. తేనెటీగల పెంపకం వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా గుర్తింపు పొందింది. రైతులు తేనెటీగలను పెంచి తేనెను సేకరించి విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయి. ముఖ్యంగా రైతులకు అదనపు ఆదాయం రావడానికి ఇది మంచి మార్గం. పూలలోని మకరందాన్ని తేనెటీగలు తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. తేనెటీగల పెంపకాన్ని శాస్త్రీయంగా “ఏపీకల్చర్” అని అంటారు. అయితే ఇప్పుడు రైతులకు శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా కుట్టని తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు.

తేనెటీగలలో కుట్టని తేనెటీగలు ఒక ప్రత్యేక జాతి. వీటిని స్టింగ్‌లెస్ బీస్ అని పిలుస్తారు. వీటికి సాధారణ తేనెటీగలలా విషపూరితమైన ముళ్లు ఉండవు. ప్రమాదం అనిపిస్తే ఇవి దవడలతో కాస్త కాటు వేస్తాయి. కానీ అది నొప్పి కలిగించేలా ఉండదు. గాయం అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. సాధారణ తేనెటీగలతో పోలిస్తే ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. వీటిని ఎక్కువగా అడవుల్లో నుంచి సేకరించి, తర్వాత శాస్త్రీయంగా పెంచుతూ వృద్ధి చేస్తారు. చెట్ల తొరల్లో, గోడల మధ్య, చిన్న చిన్న రంధ్రాల్లో ఇవి గూళ్లు నిర్మించుకుంటాయి. వీటి నుంచి సేకరించే తేనె రుచి కూడా సాధారణ తేనె కంటే భిన్నంగా ఉంటుంది. అంతేకాదు.. ఈ తేనెలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది. సాధారణ తేనె ధర కిలో రూ.1000 వరకు ఉంటే.. కుట్టని తేనెటీగలు సేకరించే తేనె ధర కిలో రూ.3000 పైగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రైతులకు సహకారం అందించేందుకు, తేనెటీగల పెంపకంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో శాస్త్రీయ తేనెటీగల పెంపకంపై 7 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రధాన శాస్త్రవేత్త మల్లికార్జునరావు తెలిపారు. ఈ శిక్షణకు వచ్చిన ట్రైనీలు అందరూ కూడా పెంపకంపై పూర్తి అవగాహన పొందారని, త్వరలో తమ తమ ప్రాంతాల్లో స్టింగ్‌లెస్ బీస్ పెంపకాన్ని ప్రారంభించే దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు.

శిక్షణలో కేవలం తేనె సేకరణ మాత్రమే కాకుండా.. రాయల్ జెల్లీ, తేనెటీగల విషం వంటి ఇతర ఉత్పత్తుల ద్వారా కూడా ఆదాయం పొందే మార్గాలను రైతులకు వివరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే తేనెటీగల పెంపకానికి ప్రభుత్వం అందించే సబ్సిడీ వివరాలను కూడా శిక్షణలో తెలియజేస్తున్నారు. మొత్తానికి.. భయం లేకుండా పెంచగలిగే కుట్టని తేనెటీగలు ఇప్పుడు రైతులకు తేనెతో పాటు మంచి ఆదాయం తెచ్చే కొత్త అవకాశంగా మారుతున్నాయి.

Also Read: ఈగలు పశువుల వద్దకు రాకుండా చేసే సహజ చిట్కా.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *