కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 13 కిమీ మృతదేహం తరలింపు!

కన్నీళ్లు మిగిల్చిన చివరి మజిలీ.. బైక్‌పై 13 కిమీ మృతదేహం తరలింపు!


కర్లపాలెం, ఫిబ్రవరి 11: సామాజిక భద్రత కరువైన ప్రస్తుత రోజుల్లో చచ్చాక కాటికి వెళ్లడం కూడా గగనమైపోతుంది. నిరుపేద జీవితం బురదలో కప్పకు కూడా సమానం కాకపోవడం విచారకరం. తాజాగా ఓ ప్రభుత్వ దవాఖానాలో వ్యక్తి మరణిస్తే స్మశానికి చేర్చేందుకు అంబులెన్స్, మహాప్రస్థానం వాహనం ఏదీ రాకపోవడం వ్యవస్థ నిర్లక్ష్యానికి పరాకాష్ట. దీంతో బంధువులు గుండెల్లో బరువును దాచుకుని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. మాటలకు అందని ఈ అమాననీయ ఘటన మంగళవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చింతాయపాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేశ్‌ (55) అలియాస్‌ నాగేశ్వరరావు మంగళవారం ఉదయం భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అతడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు బైక్‌పై బాపట్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నాగేశ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని చింతాయపాలెం తరలించేందుకు బాపట్ల ఏరియా ఆస్పత్రిలో మహాప్రస్థానం వాహనం కావాలని అడిగారు. వాహనం అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటోను ఆపి.. అడగటంతో అతగాడు రూ.3 వేలు కిరాయి అడిగాడు.

అంత డబ్బు చేతిలోలేక నిస్సహాయ స్థితిలో రోడ్డుపైనే విలవిలలాడారు. విధి లేని పరిస్థితుల్లో మృతదేహాన్ని మోటారు బైక్‌పైనే కూర్చోబెట్టుకుని 13 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడు నాగేశ్‌కు భార్య, ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని మోటారు బైక్‌పై తీసుకెళ్లిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో జిల్లా కలెక్టర్‌ వి వినోద్‌కుమార్‌ స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *