మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతుంటారు. కార్బోహైడ్రేట్లు తగ్గించి, డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆహారం తీసుకున్నప్పటికీ, ఉదయాన్నే ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవల్స్ ఎక్కువగా ఉండటం చాలామందిని ఆందోళనకు గురిచేస్తుంది. దీనిని వైద్య పరిభాషలో డాన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. ఈ సమస్యను అధిగమించడానికి కేవలం ఆహారం మార్చడం సరిపోదని, మీ ఉదయపు అలవాట్లను మార్చుకోవాలని ఫరీదాబాద్ అమృత హాస్పిటల్ నిపుణులు డాక్టర్ మోహిత్ శర్మ సూచిస్తున్నారు.
అసలు ఏంటి ఈ డాన్ ఎఫెక్ట్..?ః
మనం ఏమీ తినకపోయినా, తెల్లవారుజామున మన శరీరం సహజంగానే కార్టిసాల్, అడ్రినలిన్, గ్లూకాగాన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడానికి కాలేయం నుండి చక్కెరను రక్తంలోకి విడుదల చేస్తాయి. మధుమేహం లేనివారిలో ఇన్సులిన్ దీనిని కవర్ చేస్తుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో ఇది షుగర్ స్పైక్‌కు దారితీస్తుంది.
నిద్రలేవగానే కంగారు పడకండి
చాలామంది నిద్రలేవగానే ఫోన్ తనిఖీ చేయడం లేదా ఆఫీసు పనుల గురించి టెన్షన్ పడటం చేస్తారు. ఇది శరీరంలో ఒత్తిడిని పెంచి, చక్కెర స్థాయిలను మరింత పెంచుతుంది. నిద్రలేచిన వెంటనే 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. నిటారుగా ఉండి, దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇది మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.
నీటికే తొలి ప్రాధాన్యం
నిద్రలో శరీరం కొంత డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనివల్ల రక్తం చిక్కబడి చక్కెర శాతం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నిద్రలేచిన వెంటనే 1-2 కప్పుల సాధారణ నీరు తాగండి. ఇది కిడ్నీలు గ్లూకోజ్‌ను వడపోయడానికి మరియు ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
తేలికపాటి కదలికలు
ఖాళీ కడుపుతో తీవ్రమైన వ్యాయామాలు చేస్తే శరీరంపై ఒత్తిడి పెరిగి షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అల్పాహారానికి ముందు 10-15 నిమిషాల పాటు తేలికపాటి నడక, సాగదీత వంటివి చేయండి. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ అవసరం లేకుండానే కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను వినియోగించుకుంటాయి.
సూర్యరశ్మితో సహవాసం
మన శరీరంలోని జీవ గడియారం ఇన్సులిన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఉదయాన్నే 5-10 నిమిషాలు ఎండలో ఉండండి. ఇది మీ నిద్ర మేల్కొనే చక్రాలను క్రమబద్ధీకరించి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
ఖాళీ కడుపుతో కాఫీ – టీ వద్దు
ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే అది అడ్రినలిన్ హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది, తద్వారా షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరుగుతాయి. టీ లేదా కాఫీ తాగాలనుకుంటే, ముందుగా నీళ్లు తాగి, వ్యాయామం ముగిసిన తర్వాత లేదా అల్పాహారంతో కలిపి తీసుకోండి.
ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం
అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే చక్కెర వేగంగా పెరుగుతుంది. గుడ్లు, పనీర్, మొలకలు, బాదం లేదా పెరుగు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోండి. ఇది రోజంతా మీ ఆకలిని నియంత్రించడమే కాకుండా షుగర్ పెరగకుండా చూస్తుంది.
కాగా రక్తంలో చక్కెర నియంత్రణ అనేది ఆహారం తీసుకోవడంతో మొదలవ్వదు.. మీరు కళ్లు తెరిచిన మొదటి నిమిషంతోనే ప్రారంభమవుతుందని డాక్టర్ మోహిత్ శర్మ నొక్కి చెప్పారు. ఈ మార్పులు మందులకు ప్రత్యామ్నాయం కావు, కానీ మీ మందుల ప్రభావాన్ని రెట్టింపు చేస్తాయి.