Andhra Pradesh: ఏపీలో బర్డ్ ఫ్లూ.. 24 వేల కోళ్లు మృతి.. అన్నమయ్య జిల్లాలో అధికారుల అలర్ట్..

Andhra Pradesh: ఏపీలో బర్డ్ ఫ్లూ.. 24 వేల కోళ్లు మృతి.. అన్నమయ్య జిల్లాలో అధికారుల అలర్ట్..


అన్నమయ్య జిల్లాలోని సదుం మండలంలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో కోళ్లు భారీ సంఖ్యలో మృత్యువాత పడటంతో రైతులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సదుం మండలంలోని పుట్టావాండ్ల పల్లి, కంభంవారిపల్లి, అమ్మగారి పల్లి గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో గత కొన్ని రోజులుగా అసాధారణ రీతిలో కోళ్లు మరణించాయి. దాదాపు 24 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతి చెందిన కోళ్ల నమూనాలను మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ గల హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్‌కు పంపగా.. అక్కడ బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం బ్లీచింగ్ పౌడర్, సున్నం ఉపయోగించి మృతి చెందిన కోళ్లను సురక్షితంగా ఖననం చేశారు.

రంగంలోకి అధికార యంత్రాంగం

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈ పరిస్థితిని సమీక్షిస్తూ, వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన కోళ్ల ఫారాల రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ అంశంపై నివేదికలను నేరుగా సీఎం కార్యాలయానికి పంపిస్తున్నారు.

ప్రజలకు వైద్యుల కీలక సూచనలు

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజల్లో నెలకొన్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోళ్ల నుండి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని అధికారులు చెబుతున్నారు. 100 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ వేడి మీద ఉడికించిన మాంసంలో వైరస్ ఉండదని కాబట్టి బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు కనీసం 10 రోజుల పాటు కోడి మాంసం, గుడ్లు తినకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

హెల్ప్‌లైన్ నెంబర్లు

అన్నమయ్య జిల్లాలో ఎక్కడైనా కోళ్లు అసాధారణ రీతిలో మరణిస్తే వెంటనే 7013914401, 9398262752 తమకు సమాచారం అందించాలని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *