IND vs USA T20 World Cup 2026 :ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. పసికూన అమెరికాపై తడబడినా, చివరికి టీమిండియా తన అనుభవంతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత బ్యాటింగ్, బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో భారత్ ఈ టోర్నీలో శుభారంభం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం, ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25), శివం దూబే (0) వెనువెంటనే అవుట్ అవ్వడంతో భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. 49 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేసి జట్టుకు 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అమెరికా బౌలర్ షాడ్లీ మూడు వికెట్లతో భారత్‌ను భయపెట్టినా, సూర్య ముందు అతని ఆటలు సాగలేదు.
బౌలర్ల పంజా.. అమెరికా ఆశలు గల్లంతు!
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికాను భారత బౌలర్లు ఆరంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టారు. జస్ప్రీత్ బుమ్రా లేని లోటును మహమ్మద్ సిరాజ్ భర్తీ చేశాడు. తన మొదటి ఓవర్లోనే గౌస్‌ను అవుట్ చేసి అమెరికా పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్‌ను డకౌట్ చేయడంతో అమెరికా ఆత్మరక్షణలో పడిపోయింది. అమెరికా బ్యాటర్లు కాసేపు ప్రతిఘటించినా, భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అమెరికా లక్ష్యానికి చాలా దూరంలో ఆగిపోయింది.