IND vs USA : పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు గల్లంతు

IND vs USA : పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు గల్లంతు


IND vs USA : ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అమెరికా నిర్ణయం సరైనదేనని వారి బౌలర్లు నిరూపించారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాక్విక్ సృష్టించిన విధ్వంసం భారత అభిమానులను షాక్‌కు గురిచేసింది. భారత ఇన్నింగ్స్ 5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 44/1. క్రీజులో ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతారని అంతా భావించారు. కానీ, ఆరో ఓవర్ వేయడానికి వచ్చిన షాడ్లీ వాన్ షాక్విక్ ఆట స్వరూపాన్నే మార్చేశాడు.

రెండో బంతికి నిలకడగా ఆడుతున్న ఇషాన్ కిషన్ భారీ షాట్‌కు ప్రయత్నించి మిలింద్ కుమార్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఐదో బంతికి అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ, షాడ్లీ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడి కెప్టెన్ మోనాంక్ పటేల్ చేతికి చిక్కాడు. ఓవర్లో చివరి బంతికి క్రీజులోకి వచ్చిన శివం దూబే కనీసం ఖాతా తెరవకుండానే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

కేవలం రెండు పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి స్కోరు 46/4గా నమోదైంది. వాంఖడే వంటి బ్యాటింగ్ పిచ్‌పై ఇలాంటి కుప్పకూలడం భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఫినిషర్ రింకూ సింగ్ ఉన్నారు. బుమ్రా లేని లోటు బౌలింగ్‌లో కనిపిస్తుందనుకుంటే, బ్యాటింగ్‌లో కూడా భారత టాప్ ఆర్డర్ అమెరికా బౌలర్ల ముందు మోకరిల్లడం గమనార్హం. 200 పైచిలుకు స్కోరు సాధిస్తామనుకున్న చోట, ఇప్పుడు కనీసం 150 పరుగుల మార్కును అందుకోవడమే సవాలుగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *