
చపాతీలు సరిగ్గా రాకపోవడానికి ప్రధాన కారణం పిండిలో తేమ తగ్గిపోవడం. పాత పిండిని వాడటం లేదా పిండిని నానబెట్టకుండానే చపాతీలు చేయడం వల్ల అవి ఎండిపోయి గట్టిగా మారుతాయి. హోటల్ స్టైల్‌లో పొరలు పొరలుగా, సాఫ్ట్‌గా ఉండే చపాతీలు మీ ఇంట్లో కూడా తయారు కావాలంటే షెఫ్స్ సూచించే ఈ స్మార్ట్ టిప్స్ పాటించాల్సిందే. చపాతీలు చేసేటప్పుడు మనం చేసే ఆ 9 సాధారణ తప్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
చపాతీలు చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులివే:
పాత పిండిని వాడటం: చాలా కాలం క్రితం కలిపి ఫ్రిజ్‌లో పెట్టిన పిండిని వాడకండి. ఇది తేమను కోల్పోయి చపాతీలు ఎండిపోయేలా చేస్తుంది.
నీళ్లు కలిపే పద్ధతి: పిండిలో ఒకేసారి నీళ్లు పోయకండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకుంటేనే పిండి పర్ఫెక్ట్‌గా తయారవుతుంది.
కలిపే సమయం: పిండిని మరీ తక్కువగా లేదా ఎక్కువగా కలపకూడదు. 6 నుండి 8 నిమిషాల పాటు పిసికితే చపాతీలు విరిగిపోకుండా మృదువుగా వస్తాయి.
నానబెట్టకపోవడం: పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకండి. కనీసం 20 నిమిషాల పాటు నానబెడితేనే తేమ సమానంగా వ్యాప్తి చెందుతుంది.
పిండి ఉండలు : పిండిని సమాన పరిమాణంలో, పగుళ్లు లేకుండా ఉండలుగా చుట్టాలి. లేదంటే చపాతీ అసమానంగా కాలుతుంది.
రుద్దే విధానం: చపాతీని మరీ మందంగా చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది, మరీ సన్నగా చేస్తే త్వరగా ఆరిపోయి అప్పడంలా మారుతుంది. 15-18 సెం.మీ సైజు ఉత్తమం.
మంట ఉష్ణోగ్రత: చపాతీని ఎప్పుడూ మీడియం మంట మీదే కాల్చాలి. హై ఫ్లేమ్ మీద కాల్చితే పైన నల్లగా మాడిపోయి లోపల ఉడకదు.
తిప్పే సమయం: చపాతీని వేసిన వెంటనే తిప్పకూడదు. ఒక వైపు చిన్నగా గోధుమ రంగు మచ్చలు వచ్చాకే రెండో వైపుకు తిప్పాలి.
నిల్వ చేయడం: కాలిన చపాతీలను బయట గాలికి వదిలేయకండి. వెంటనే ఒక హాట్ బాక్స్‌లో లేదా మూత ఉన్న కంటైనర్‌లో ఉంచితే అవి చాలా సేపు వెచ్చగా, మెత్తగా ఉంటాయి.