తెలంగాణ ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ భారీ శుభవార్త అందించింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్ స్టేషన్లు నిర్మాణానికి సిద్దమవుతుండగా.. ఇప్పటికే ఉన్న కొన్ని బస్టాండ్లను ఆధునీకరిస్తోంది. అలాగే బస్ డిపోలను కూడా కొత్తగా నిర్మించేందుకు సిద్దమవుతోంది. కొత్త బస్ స్టేషన్ల రాకతో పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం అందుబాటులోకి రానుండటంతో స్థానిక ప్రజలకు రవాణా సదుపాయం రానుంది. రాష్ట్రంలో కొత్త 13 బస్ స్టేషన్లను కొత్తగా నిర్మించాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో ఇప్పటికే కొన్ని స్టేషన్ల పనులు ప్రారంభమయ్యాయి. అలాగే రెండు బస్ డిపోల నిర్మాణం చేపడుతోంది.
శరవేగంగా బస్సు డిపోల పనులు
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం అందుబాటులో లేదు. దీంతో మరింత మంది ప్రజలకు బస్సు సదుపాయం కల్పించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కొత్త బస్టాండ్ల నిర్మాణం చేపడుతోంది. పెద్దపల్లిలో రూ.11.01 కోట్లతో కొత్త బస్ డిపో నిర్మిస్తుండగా.. వీటి పనులు వేగంగా జరుగుతున్నాయి. పాత భవనాలను తొలగించి కొత్తవి నిర్మిస్తున్నారు. యార్డు లెవలింగ్ పనులు ప్రస్తుతం చేస్తున్నారు. ఇక ఏటూరు నాగారం బస్సు డిపో పనులు కూడా నడుస్తున్నాయి. 3.79 ఎకరాల్లో ఈ నిర్మాణం జరుగుతుండగా.. ఇందుకోసం రూ.5.91 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లోగా ఈ బస్సు డిపోను ప్రారంభించాలనే లక్ష్యం ఆర్టీసీ అధికారులు నిర్దేశించుకున్నారు. ఈ డిపో రాకతో బొగత జలపాతం, లక్నవరం, మేడారం, తాడ్వాయి, ఏటూరునాగారం ప్రాంతాల వైపు వెళ్లేవారి బస్సు సదుపాయం లభిస్తుంది.
కొత్త బస్ స్టేషన్లు ఎక్కడంటే..?
-నిజామాబాద్, వేములవాడ, నాగర్ కర్నూల్, హుజూర్ నగర్, కోదాడ, మంథని, ములుగు, కాళేశ్వరం, మధిర, మహబూబ్ నగర్, గంగాధర , రేగొండ, మాడ్గులలో కొత్త బస్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నారు
– అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా వీటిని నిర్మిస్తున్నారు
-రూ.16.89 కోట్లతో కోదాడ బస్ స్టేషన్ నిర్మాణం. హైదరాబాద్-విజయవాడ హైవేలో ఏర్పాటు
-టెండర్ల దశలో మరో 7 కొత్త బస్ స్టేషన్లు
-కొత్త బస్టాండ్లతో అన్ని జిల్లాలు, పట్టణాలకు బస్సు సౌకర్యం