Headlines

Ranveer Singh- Shankar combo: ‘ధురంధర్’తో వెయ్యి కోట్ల విధ్వంసం.. విక్రమ్‌తో కలిసి క్రేజీ మల్టీస్టారర్!

Ranveer Singh- Shankar combo: ‘ధురంధర్’తో వెయ్యి కోట్ల విధ్వంసం.. విక్రమ్‌తో కలిసి క్రేజీ మల్టీస్టారర్!


బాలీవుడ్ బాక్సాఫీస్‌ను తన నటనతో, ఎనర్జీతో షేక్ చేస్తున్న ఆ హీరో.. ఇప్పుడు సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్‌తో జతకట్టబోతున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి తిరుగులేని ఫామ్‌లో ఉన్న ఆ స్టార్ హీరో, ఇప్పుడు ఒక చారిత్రక వీరుడి కథలో కనిపించబోతున్నారు. ఐదేళ్ల క్రితమే వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ దర్శకుడు తన ప్రాణప్రదంగా భావించే ఒక డ్రీమ్ ప్రాజెక్టును ఈ బాలీవుడ్ హీరోతో పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సౌత్ ఇండియన్ వర్సటైల్ యాక్టర్ విక్రమ్ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నారట. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి? శంకర్ తన పాత ఫామ్‌ను ఈ సినిమాతో తిరిగి అందుకుంటారా?

రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగించింది. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా శుక్రవారం నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ సీక్వెల్ కూడా మార్చి 19న రాబోతోందని సమాచారం. ఈ భారీ విజయంతో రణవీర్ సింగ్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో ఆయన నటించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వేల్పారి’..

దర్శక దిగ్గజం శంకర్ ఎప్పటి నుంచో ‘వీర యుగ నాయగన్ వేల్పారి’ అనే చారిత్రక నవలను వెండితెరపై ఆవిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్. తమిళనాడు చరిత్రలో గొప్ప దాతృత్వం, సాటిలేని ధైర్యసాహసాలకు పేరుగాంచిన వేల్పారి రాజు కథ ఇది. ఈ కథను శంకర్ ఇద్దరు హీరోల మల్టీస్టారర్‌గా మలిచినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక హీరోగా రణవీర్ సింగ్, మరో హీరోగా చియాన్ విక్రమ్ నటించబోతున్నారని కోలీవుడ్ సమాచారం. పెన్ మీడియా సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చింది.

నిజానికి ఐదేళ్ల క్రితమే రణవీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తానని శంకర్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ఈ లోపు శంకర్ తీసిన ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో తన పూర్వ వైభవాన్ని చాటుకోవడానికి శంకర్ ఈ ‘వేల్పారి’ కథను నమ్ముకున్నారు. రణవీర్ సింగ్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు.

తమిళ సంస్కృతికి, ఆచారాలకు అత్యంత దగ్గరగా ఉండే వేల్పారి కథను ఒక బాలీవుడ్ హీరోతో తీయడంపై కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో మణిరత్నం తీసిన ‘పొన్నియిన్ సెల్వన్’ తమిళంలో ఘనవిజయం సాధించినా, తెలుగుతో పాటు ఇతర భాషల్లో నేటివిటీ సమస్య వల్ల ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు శంకర్ కూడా అలాంటి చారిత్రక కథనే ఎంచుకోవడంతో, అది అందరికీ కనెక్ట్ అవుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. అయితే శంకర్ మార్క్ మేకింగ్, రణవీర్ సింగ్ నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. శంకర్ విజువల్ వండర్ లో రణవీర్ సింగ్, విక్రమ్ వంటి స్టార్స్ కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరి ‘వేల్పారి’గా రణవీర్ సింగ్ ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *