పరిమాణంలో చిన్నదైనా విశేషాల్లో మాత్రం ఈ దేశం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి దేశానికి సొంత విమానాశ్రయం, సొంత కరెన్సీ ఉండటం సహజం. కానీ, ఈ దేశానికి ఇవేవీ లేవు. అయినా సరే, ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా ఈ దేశం వెలుగొందుతోంది.
ప్రపంచంలోని దేశాలన్నీ తమకంటూ ఒక విమానాశ్రయం ఉండాలని, సొంత నాణేలను ముద్రించుకోవాలని తహతహలాడుతుంటాయి. కానీ, లిక్తెన్ స్టెయిన్ మాత్రం ఈ సంప్రదాయాలకు పూర్తి భిన్నం. అప్పర్ రైన్ వ్యాలీలో నెలకొన్న ఈ దేశం ఒకవైపు స్విట్జర్లాండ్, మరోవైపు ఆస్ట్రియా పర్వతాలతో సరిహద్దులను పంచుకుంటుంది. మీరు ఈ దేశంలోని ఒక పచ్చని మైదానంలో నిలబడి చుట్టూ ఒక రౌండ్ తిరిగితే.. దేశం అంచులన్నీ మీకు స్పష్టంగా కనిపిస్తాయి. అంత చిన్న దేశం మరి ఎలా మనుగడ సాగిస్తోంది? అక్కడ ప్రజల జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
విమానాశ్రయం లేని ప్రయాణం..
ఈ దేశ రాజధాని ‘వదుజ్’ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటే, మీ విమాన టిక్కెట్ బుకింగ్ సైట్ లో ఆ దేశం పేరు కనిపించదు. ఎందుకంటే లిక్తెన్ స్టెయిన్ కు అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. పర్యాటకులు ముందుగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో దిగి, అక్కడి నుండి 115 కిలోమీటర్ల దూరం రైలులో లేదా కారులో ప్రయాణించాలి. ఈ ప్రయాణం ఒక సినిమాను తలపిస్తుంది. మంచుతో నిండిన శిఖరాలు, పారే రైన్ నది, విస్తారమైన ద్రాక్ష తోటల మధ్య నుండి సాగే ప్రయాణం పర్యాటకులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది.
సొంత కరెన్సీ లేదు..
ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా లిక్తెన్ స్టెయిన్ గుర్తింపు పొందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో పౌరుల కంటే అక్కడ రిజిస్టర్ అయిన కంపెనీలే ఎక్కువ. ఇంత ధనిక దేశమైనా వీరికి సొంత కరెన్సీ లేదు. స్విట్జర్లాండ్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం వీరు ‘స్విస్ ఫ్రాంక్’ నే వాడుతారు.
ఈ దేశం ఒక హై-ఎండ్ విలేజ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్‌లు ఉండవు, నేరాల రేటు చాలా తక్కువ. ప్రజలు తమ ఇంటి తలుపులకు తాళాలు కూడా వేయరు. దేశంలోని జైలులో ఎప్పుడూ ఒకరిద్దరి కంటే ఎక్కువ ఖైదీలు ఉండరు. 1868 నుండే ఈ దేశానికి సైన్యం కూడా లేదు. విమానాశ్రయం, సైన్యం, కరెన్సీ వంటివి లేకపోయినా లిక్తెన్ స్టెయిన్ తనదైన శైలిలో రాణిస్తోంది. ప్రకృతి సౌందర్యం, ప్రశాంతత కోరుకునే పర్యాటకులకు ఇది ఒక స్వర్గం. ఈ దేశాన్ని చూస్తే.. అభివృద్ధి అంటే కేవలం పెద్ద పెద్ద కట్టడాలు మాత్రమే కాదు, ప్రశాంతమైన జీవనశైలి కూడా అని అర్థమవుతుంది.