
అంతర్జాతీయ చమురు అక్రమ రవాణాపై భారత్ ఉక్కుపాదం మోపింది. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న మూడు భారీ చమురు ట్యాంకర్లను భారత తీర రక్షక దళం విజయవంతంగా స్వాధీనం చేసుకుంది. ముంబై తీరానికి పశ్చిమాన 100 నాటికల్ మైళ్ల దూరంలో భారత ప్రత్యేక ఆర్థిక మండలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ నౌకలను అడ్డుకుని, ప్రస్తుతం తదుపరి విచారణ కోసం ముంబై నౌకాశ్రయానికి తరలించారు.
ఆపరేషన్ క్లీన్ సీ: అసలేం జరిగింది?
ఫిబ్రవరి 6న భారత జలాల్లో ఒక ట్యాంకర్ నుండి మరో ట్యాంకర్‌కు చమురు మారుస్తున్న క్రమంలో భారత అధికారులు ఈ మెరుపు దాడి చేశారు. ఆంక్షల నుండి తప్పించుకోవడానికి ఈ నౌకలు తరచూ తమ పేర్లను, గుర్తింపులను మారుస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జాఫ్జియా నౌకలు గతంలో అమెరికా మంజూరు చేసిన గ్లోబల్ పీస్, చిల్ 1, గ్లోరీ స్టార్ 1 నౌకల గుర్తింపులతో పోలి ఉన్నాయి. వీటిలో అల్ జాఫ్జియా, స్టెల్లార్ రూబీ నౌకలకు ఇరాన్‌తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు LSEG డేటా ధృవీకరించింది. ఆంక్షల కారణంగా భారీ తగ్గింపు ధరలకు దొరికే ఇరాన్ చమురును, తప్పుడు డాక్యుమెంటేషన్ ద్వారా ఇతర దేశాలకు తరలించడమే ఈ నౌకల ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
అమెరికా – భారత్ బంధంలో కొత్త మలుపు
ఈ చర్య వెనుక బలమైన దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలే రష్యా నుండి చమురు దిగుమతులను తగ్గించడానికి న్యూఢిల్లీ అంగీకరించిన నేపథ్యంలో వాషింగ్టన్ భారత వస్తువులపై దిగుమతి సుంకాలను 50శాతానికి నుండి 18కి భారీగా తగ్గించింది. అమెరికాతో మెరుగుపడుతున్న సంబంధాల దృష్ట్యా, అంతర్జాతీయ ఆంక్షలను అమలు చేయడంలో భారత్ తన కట్టుబాటును ఈ జప్తు ద్వారా చాటిచెప్పింది.
సముద్రంలో కనీవినీ ఎరుగని నిఘా
ఈ ఘటన తర్వాత భారత తీర రక్షక దళం తన నిఘాను ముమ్మరం చేసింది. దాదాపు 55 యుద్ధ నౌకలు, 12 నిఘా విమానాలను సముద్రంలో 24 గంటల పహారా కోసం రంగంలోకి దింపారు. భారత జలాలను అక్రమ చమురు బదిలీలకు అడ్డాగా మార్చుకోకుండా నిరోధించడమే ప్రధమ కర్తవ్యంగా అధికారులు భావిస్తున్నారు. మధ్యవర్తులు, సంక్లిష్టమైన యాజమాన్య నిర్మాణాలు, తప్పుడు గుర్తింపులతో సాగుతున్న ఈ ‘షాడో ట్రేడ్’ను అడ్డుకోవడం ద్వారా భారత్ తన సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసుకుంది.