‘సనాతన బానిసత్వాన్ని అంతం చేసే ఆయుధం అదొక్కటే’ కమల్ హాసన్‌ ఘాటు వ్యాఖ్యలు

‘సనాతన బానిసత్వాన్ని అంతం చేసే ఆయుధం అదొక్కటే’ కమల్ హాసన్‌ ఘాటు వ్యాఖ్యలు


‘సనాతన బానిసత్వాన్ని అంతం చేసే ఆయుధం అదొక్కటే’ కమల్ హాసన్‌ ఘాటు వ్యాఖ్యలు

నియంతృత్వం, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉందని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్‌ (MNM) పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌ హాసన్ అన్నారు. తమిళ నటుడు సూర్య నడుపుతోన్న అగరం ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కమల్‌ హాసన్ నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షను, తమిళనాడులోని నిరుపేద విద్యార్ధులపై దాని ప్రభావాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. 2017లో ప్రారంభమైన ‘నీట్‌’ ఎంతో మందికి విద్యను దూరం చేసిందని ఆయన అన్నారు. ఇంకా ఈ విధంగా మాట్లాడారు..

‘చట్టాన్ని మార్చడానికి విద్య మాత్రమే బలాన్ని ఇస్తుంది. ఈ యుద్ధంలో విద్య కేవలం ఒక ఆయుధం కాదు. అది దేశాన్ని చెక్కగల ఉలి అని’ అన్నారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు. గెలవాలంటే వేరే ఏ ఆయుధాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఆ విధంగా మీరు గెలవలేరు. మెజారిటీ మూర్ఖులు మిమ్మల్ని ఓడిస్తారు. జ్ఞానం ఓడిపోతుంది. మనం సమిష్టిగా కలిసి నిలబడాలి. అందుకు కేవలం విద్యను మాత్రమే గట్టిగా పట్టుకోవాలి’ అని కమల్ హాసన్‌ సూచించారు. విద్యా వ్యవస్థలు, సామాజిక సాధికారతపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

తమిళనాడులో వైద్య ప్రవేశాలకు నీట్ విధానంపై కొనసాగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ కోచింగ్ పొందగలిగే సంపన్న పట్టణ నేపథ్యాల విద్యార్థులకు నీట్ అసమానంగా అనుకూలంగా ఉందని, గ్రామీణ – ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను, అధిక బోర్డు మార్కులు ఉన్నవారిని కూడా ఇది అణచి వేస్తుందని అన్నారు. తన ప్రసంగంలో కమల్ ‘సనాతన’ అనే పదాన్ని ఉపయోగించారు. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి.

కాగా 2023లో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ‘సనాతన ధర్మాన్ని.. దోమల వల్ల వచ్చే వ్యాధుల మాదిరిగానే నిర్మూలించాలని, దానిని కుల ఆధారిత వివక్షతో సమానం చేయాలని చెప్పడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది.
దీంతో ఆయనపై దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎన్నో కేసులు నమోదయ్యాయి. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఈ వ్యవహారం సర్దుమనిగింది. తమిళనాడు రాష్ట్రంలో నీట్ పరీక్షపై తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దం పాటు వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలను రద్దు చేసి, 12వ తరగతి మార్కులను ప్రాతిపదికగా మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇచ్చేలా యూపీఏ పాలనలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తమిళనాడుకు మినహాయింపు ఇచ్చారు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ మినహాయింపును ఎత్తివేసింది. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *